
ప్రకృతి ఒడిలో జీవరాశుల మనుగడ అత్యంత విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనది. సాధారణంగా పక్షులు గూళ్లు కట్టుకుని, గుడ్లు పెట్టి, తమ శరీర వేడితో వాటిపై కూర్చుని పొదగడం మనకు తెలిసిన సహజ ప్రక్రియ. అయితే ప్రకృతి సహజ ధర్మాలను సైతం తలకిందులు చేసేలా.. అగ్నిపర్వతాల నుంచి వెలువడే వేడి బూడిద, భూగర్భ ఉష్ణశక్తిని ఉపయోగించి గుడ్లను పొదిగించే వింతైన పక్షుల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. అవే మెగాపోడ్ జాతికి చెందిన మాలియో పక్షులు. గ్రీకు భాషలో మెగాపోడ్ అంటే పెద్ద పాదాలు అని అర్థం. కోడి, టర్కీ పోలికలతో ఉండే ఈ పక్షులు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పాపువా న్యూగినియాతో పాటు భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులలో ప్రధానంగా కనిపిస్తాయి. వీటి పాదాలు, గోళ్లు అత్యంత బలంగా ఉండి, నేలను సులభంగా తవ్వేందుకు అనుకూలంగా ఉంటాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది.
గుడ్లు పెట్టే కాలం రాగానే ఈ పక్షులు జీవన మనుగడ కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. ముఖ్యంగా క్రియాశీల అగ్నిపర్వతాల సమీప ప్రాంతాలు లేదా భూగర్భ వేడి నీటి ఊటలు ఉన్న ప్రదేశాలను వెతుక్కుంటూ చేరుకుంటాయి. అక్కడ నిరంతరం వెచ్చగా ఉండే అగ్నిపర్వత బూడిదను తమ బలమైన కాళ్లతో సుమారు 3 నుంచి 4 అడుగుల లోతు గొయ్యిగా తవ్వుతాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. గుడ్లు పొదగడానికి సరిగ్గా 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఆ ఉష్ణోగ్రతను ఈ పక్షులు తమ ముక్కు, గొంతులోని సున్నితమైన జ్ఞానేంద్రియాల ద్వారా ఖచ్చితంగా కొలుస్తాయి.
ఉష్ణోగ్రత సరిగ్గా ఉందని నిర్ధారించుకున్న తర్వాత, ఆడ పక్షి ఆ గొయ్యిలో గుడ్లు పెడుతుంది. అనంతరం ఆ రంధ్రాన్ని మళ్లీ వేడి బూడిదతో కప్పేసి, అక్కడి నుంచి శాశ్వతంగా ఎగిరిపోతుంది. తల్లి పక్షి గుడ్లపై కూర్చోవడం గానీ, వాటిని కాపాడటం గానీ చేయదు. అగ్నిపర్వత బూడిదలోని భూగర్భ వేడే ఒక సహజ సిద్ధమైన ఇంక్యుబేటర్‌లా పనిచేసి, గుడ్లను వాటంతట అవే పొదిగేలా చేస్తుంది.
సుమారు 60 నుంచి 80 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గుడ్డు నుంచి పిల్ల పక్షి బయటకు వస్తుంది. అయితే ఆ పిల్లల పోరాటం అక్కడి నుంచే మొదలవుతుంది. తమ పైన కప్పబడి ఉన్న 4 అడుగుల లోతు వేడి బూడిదను సొంతంగా తవ్వుకుంటూ భూమి పైకి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అవి బయటపడటానికి కొన్ని గంటల నుంచి రోజుల సమయం పడుతుంది.
సాధారణ పక్షి పిల్లలు పుట్టినప్పుడు కళ్లు తెరవలేవు, రెక్కలు ఉండవు, తల్లి తెచ్చిపెట్టే ఆహారంపై ఆధారపడతాయి. కానీ మెగాపోడ్ పిల్లలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఇవి భూమి లోపలి నుంచి బయటకు వచ్చే క్షణానికే పూర్తిస్థాయి రెక్కలు, బలిష్టమైన శరీరంతో ఉద్భవిస్తాయి. భూమిపై అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే శరవేగంగా పరిగెత్తడం, ఆహారాన్ని వేటాడటం, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఎగరడం వంటి అద్భుత సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. తమ జీవితకాలంలో కన్న తల్లిదండ్రుల ముఖాన్ని ఎన్నడూ చూడకుండానే, ప్రకృతి ఒడిలోనే స్వతంత్రంగా జీవనం సాగిస్తాయి. ప్రకృతి సృష్టించిన ఈ వింత విన్యాసం జీవశాస్త్రవేత్తలను సైతం నిరంతరం విస్మయానికి గురిచేస్తూనే ఉంది.