రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వివాదాస్పద మత గురువు స్వామి నిత్యానంద దేశం విడిచి పరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ అమెరికాలో ట్రినిడాడ్ అండ్ టొబాగో సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద దానికి కైలాస దేశంగా పేరు పెట్టడంతో పాటు ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాడు. ఇక తాజాగా దీని గురించి వివరాలు వెల్లడిస్తూ.. మరో వీడియోను ఫేస్‌బుక్‌లో విడుదల చేశారు. కైలాస దేశంలో పౌరసత్వం కోసం 12లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు నిత్యానంద వెల్లడించాడు. త్వరలోనే కైలాస దేశం ఏర్పాటుపై పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తమ దేశంలో పౌరసత్వం కోసం ఎంక్వైరీ చేసే వారితో తమ ఈమెయిల్స్ నిండిపోతున్నాయని, కైలాస దేశం కోసం చందాలు ఇచ్చిన దాతలకు కృతఙ్ఞతలని తెలిపాడు. ఇక తన దేశంపై వస్తోన్న విమర్శల వల్లనే దానికి ఇంకా పాపులారిటీ వచ్చిందని.. డబ్బుల కోసమే కొంతమంది తన దేశంపై విమర్శలు చేస్తున్నారని అన్నాడు. కైలాసం అనేది ఓ భౌగోళిక ప్రాంతం కాదని.. ఇదొక ఆధ్యాత్మిక భావన అని నిత్యానంద చెప్పుకొచ్చాడు.
అయితే తాము నిత్యానందకు ఎలాంటి భూమి కేటాయించలేదని.. తమ ప్రభుత్వానికి, ఆయనకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఈక్వెడార్ ఎంబసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు కైలాసం వదిలేసి హైతీ వెళ్లినట్లు ఈక్వెడార్ ప్రభుత్వం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.