కంకరరాళ్ల మధ్య ఇరుక్కున్న ఇయర్ బడ్.. 5 నిమిషాల్లో పట్టేసింది!
టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత మన రోజువారీ పనులు సులువుగా మారాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం దగ్గర్నుంచి ఫొటోలను విశ్లేషించడం వరకు అనేక పనుల్లో AI సాయం చేస్తోంది. తాజాగా ఓ వ్యక్తికి ఎదురైన సమస్యను AI ఎలా పరిష్కరించిందో చూద్దాం.

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత మన రోజువారీ పనులు సులువుగా మారాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం దగ్గర్నుంచి ఫొటోలను విశ్లేషించడం వరకు అనేక పనుల్లో AI సాయం చేస్తోంది. తాజాగా ఓ వ్యక్తికి ఎదురైన సమస్యకు AI ఎలా పరిష్కరించిందో చూద్దాం. ఓ సాయంత్రం తన కుమారుడితో కలిసి పార్కుకు వెళ్లినట్లు ఓ వ్యక్తి రెడ్డిట్‌లో పంచుకున్నాడు. ఆ చిన్నారి పార్కింగ్ ప్రాంతం వైపు పరుగెత్తాడట. బాలుడిని ఆపేందుకు తండ్రి వెనకే పరుగెత్తాడు. ఆ సమయంలో అతని హూడీ ముందు జేబు నుంచి ఇయర్ బడ్ కేసు కింద పడి ఇయర్ బడ్‌లు చెల్లాచెదురుగా పడ్డాయట. చుట్టూ ఉన్న కంకర రాళ్ల మధ్యకు ఓ ఇయర్‌బడ్ ఎగిరిపడింది . చిన్నగా, తెల్లగా ఉండే ఇయర్ బడ్‌ను వెతకడం అతనికి పెద్ద పనిలా మారింది. కంకర రాళ్ల మధ్య కనిపించలేదు. అప్పటికే సూర్యాస్తమయం సమీపిస్తుండటంతో వెలుతురు కూడా తగ్గింది. దాదాపు పది నిమిషాలు వెతికినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.
ఫొటోలు పంపితే.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ!
ఇక లాభం లేదనుకుని ఏం చేయాలో ఆలోచించాడు. చాట్‌జీపీటీ ని సాయం అడగాలని భావించాడు. ఇయర్‌బడ్ పడిపోయిన ప్రాంతంలో కంకర రాళ్లను ఫొటో తీసి చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేశాడు. ఇయర్‌బడ్ ఎక్కడుందో గుర్తించాలని ప్రాంప్ట్ ఇచ్చాడు. మరింత దగ్గరగా ఫొటోలు తీసి పంపాలని ChatGPT సూచించింది. క్లోజప్ ఫొటోలను అప్‌లోడ్ చేయగా ఫొటోలను పరిశీలించిన చాట్‌జీపీటీ కంకర రాళ్ల మధ్య దాగి ఉన్న ఇయర్ బడ్‌ను గుర్తించింది. అది ఉన్న ప్రదేశాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ ఫొటోను అందించింది. ఈ ప్రక్రియ మొత్తం ఐదు నిమిషాలు కూడా పట్టలేదని ఆ వ్యక్తి తన అనుభవాన్ని రెడ్డిట్ లో పంచుకున్నాడు.
దృష్టిలోపం ఉన్నవారికీ ఉపయోగపడుతుందా?
ఈ సాంకేతికతపై స్పందించిన ఓ నెటిజన్ భవిష్యత్తులో ChatGPT వంటి AI సాధనాలు దృష్టిలోపం ఉన్నవారి జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించడం, అవసరమైన వస్తువులను వెతకడం, పరిసరాలను అర్థం చేసుకోవడం వంటి రోజువారీ పనుల్లో AI సాయం అందించగలిగితే.. దృష్టిలోపం ఉన్నవారు మరింత స్వతంత్రంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, టేబుల్‌పై ఉన్న వస్తువులను గుర్తించడం, కిందపడిపోయిన వస్తువును వెతకడం, ఒక ఫొటోలో ఏముందో తెలుసుకోవడం వంటి పనుల్లో AI ఆధారిత ఇమేజ్ రికగ్నిషన్ ఉపయోగపడుతుంద. కెమెరా ద్వారా సేకరించిన దృశ్యాలను విశ్లేషించి, వాటిని మాటల రూపంలో వివరిస్తే.. రోజువారీ పనులు మరింత సులువయ్యే అవకాశం ఉంది.