ఉరుకుల పరుగుల జీవితం.. ప్రతీ రోజూ సంపాదన కోసమే వేట.. వ్యక్తిగత జీవితం, ఆహ్లాదకరమైన వాతావరణానికి దాదాపుగా దూరంగా ఉంటూ.. సగటు ఉద్యోగి ప్రతీ వారం ఆరు రోజుల పాటు అఫీసులకే పరిమితమవుతుంటారు. పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలంటే.. ఆఫీస్ టైమింగ్స్ కంటే ఎక్కువ సేపు కష్టపడాల్సిందే. దీనితో ఎక్కడలేని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వరుసగా మనల్ని సతమతం చేస్తుంటాయి. అయితే ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు, మనో ధైర్యాన్ని పెంచేందుకు ఇకపై కార్యాలయాల్లో పని వేళలు మార్చేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. అలాగే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వారానికి 4 రోజుల పని విధానం ఉద్యోగులకు ఎంతగానో మంచి చేస్తుందని తేలింది.
దేశంలోని పలు ప్రముఖ కంపెనీలు వారానికి 4 రోజుల పని విధానాల్లో అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. అలాగే ఉద్యోగులు కూడా ఈ విధానానికి సిద్దంగా ఉన్నట్లు హెచ్‌ఆర్ సొల్యుషన్స్ సంస్థ, జీనియస్ కన్సల్టెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. భారత్‌లో దాదాపు 60 శాతం కంపెనీలు వారానికి 4 రోజుల పని విధానానికి సుముఖంగా ఉన్నట్లు తేలింది. ఈ పని విధానం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి, మనో ధైర్యం పెరుగుతుందని భావిస్తున్నారు. హెచ్‌ఆర్ సొల్యుషన్స్ సంస్థ, జీనియస్ కన్సల్టెంట్స్ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 మధ్య ఈ సర్వేను నిర్వహించగా.. ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, ఐటీ బీపీవో, ఎఫ్ఎంసీజీ లాంటి 1,113 కంపెనీలు పాల్గొన్నాయి.
మరోవైపు వారానికి నాలుగు పని విధానం వల్ల ప్రొడక్టివిటీలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటాయని 11 శాతం కంపెనీలు చెబుతున్నాయి. అయితే 11 శాతం కంపెనీలు మాత్రం ఈ పని విధానం ద్వారా పాజిటివ్స్, నెగటివ్స్ అనేవి చెప్పలేకపోయాయి. మూడు రోజులు సెలవు దొరుకుంటుందంటే రోజుకు 12 గంటల పాటు పని చేసేందుకు సిద్దమని ఉద్యోగులు చెబుతున్నారని కంపెనీలు వెల్లడించాయి. మరి ఈ పని విధానం త్వరలో అమలు అవుతుందా.? లేదా.? అనేది చూడాలి.