మన శరీరంలో ఈ 10 అవయవాలు లేకున్నా బతకొచ్చు.. అవేంటో తెలుసా..?

మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. ప్రతిదీ మనకు అవసరమే. అయితే కొన్ని అవయవాలు లేకుండా మనం బతకొచ్చా అంటే హాయిగా జీవించొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మన బాడీలోని ఈ 10 భాగాలు లేకున్నా బతకొచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మన శరీరంలో ఈ 10 అవయవాలు లేకున్నా బతకొచ్చు.. అవేంటో తెలుసా..?
Human Body

Updated on: Aug 30, 2025 | 12:01 PM

మన శరీరంలోని ప్రతి అవయవం మనం బతకాడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అవి తప్పనిసరి అని మనం భావిస్తాం. కానీ వాస్తవానికి కొన్ని అవయవాలు లేకపోయినా మనిషి సాధారణ జీవితాన్ని గడపగలడు. బతకడానికి అవసరం లేని 10 అవయవాలను వైద్య నిపుణులు గుర్తించారు. వాటి గురించి ఈ స్టోరీలో  తెలుసుకుందాం.

ఊపిరితిత్తి

ఒక ఊపిరితిత్తిని తీసివేస్తే శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. మిగిలిన ఊపిరితిత్తి ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. అయితే పరిగెత్తడం, ఎక్కువ శారీరక పనులు చేయడం కష్టం అవుతుంది. అలాగే అలెర్జీలు, కాలుష్యం, ఇన్‌ఫెక్షన్లు ప్రమాదకరంగా మారతాయి కాబట్టి జాగ్రత్త అవసరం.

కిడ్నీ

సాధారణంగా మన శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అయితే ఒక కిడ్నీ ఉన్నా కూడా ఈ పని సులభంగా జరుగుతుంది. ఒకవేళ ఒక కిడ్నీని తొలగించాల్సి వస్తే, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. జీవితం సాధారణంగానే కొనసాగుతుంది. పెద్దగా మందుల అవసరం ఉండదు.

అపెండిక్స్

అపెండిక్స్ అనేది ప్రేగులకు సమీపంలో ఉండే ఒక చిన్న సంచి లాంటి భాగం. నేటి ఆధునిక జీవనశైలిలో దీని అవసరం చాలా తక్కువ. శాస్త్రవేత్తల ప్రకారం.. పూర్వకాలంలో మొక్కల ఆధారిత ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఇది ఉపయోగపడేది. దీనిని తొలగించినా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. కొద్దిరోజుల్లోనే మందులు లేకుండానే మనిషి సాధారణ స్థితికి వస్తాడు.

పిత్తాశయం (గాల్ బ్లాడర్)

పిత్తాశయం అనేది కాలేయం తయారు చేసే పిత్తరసాన్ని నిల్వ చేసే ఒక చిన్న సంచి. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఒకవేళ దీన్ని తొలగించాల్సి వస్తే, కాలేయం నేరుగా పిత్తరసాన్ని ప్రేగులకు పంపుతుంది. ఆపరేషన్ తర్వాత మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. కొన్ని వారాల్లోనే శరీరం దీనికి అలవాటు పడుతుంది.

కడుపు (స్టమక్)

కడుపు ఆహారాన్ని నిల్వ చేసి, జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని తొలగిస్తే ఆహారం నేరుగా ప్రేగులకు వెళ్తుంది. ఈ పరిస్థితిలో విటమిన్ సప్లిమెంట్లు, సరైన ఆహారం, వైద్య పర్యవేక్షణ తప్పనిసరి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకుంటే జీవితం సాధ్యమే.

చిన్న ప్రేగు

చిన్న ప్రేగు ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. దీనిలో పెద్ద భాగాన్ని తొలగిస్తే “షార్ట్ గట్ సిండ్రోమ్” అనే సమస్య వస్తుంది. దీని వల్ల విరేచనాలు, నీరసం, పోషకాహార లోపం వంటివి ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో రోగికి ఇంజెక్షన్లు లేదా ఇతర మార్గాల్లో ఆహారం అందించాల్సి ఉంటుంది. అయినా కొన్ని జాగ్రత్తలతో సాధారణంగా జీవించొచ్చు.

కోలన్

కోలన్ ఆహారం నుంచి నీరు, పోషకాలను గ్రహించి విసర్జన పదార్థాలను తయారు చేస్తుంది. దీన్ని తొలగిస్తే తరచుగా పల్చని విసర్జన జరుగుతుంది. కొందరికి కడుపుపై “కోలోస్టమీ బ్యాగ్” అమర్చాల్సి వస్తుంది. దానిలో విసర్జన పదార్థం చేరుతుంది. సరైన జాగ్రత్తలతో ఇలాంటివారు కూడా సాధారణ జీవితం గడపగలరు.

గుదము (అనస్)

గుదమును తొలగించాల్సి వస్తే కడుపులో కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసి వ్యర్థాలు బయట ఉన్న ఒక బ్యాగ్‌లోకి చేరేలా చేస్తారు. ఇది జీవితాంతం కొనసాగించాల్సిన మార్పే అయినా, సరైన వైద్య సంరక్షణతో ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని గడపవచ్చు.

అన్నప్రణాళి (ఈసోఫాగస్)

అన్నప్రణాళి గొంతు నుంచి కడుపు వరకు ఆహారాన్ని తీసుకెళ్లే నాళం. దీన్ని తొలగిస్తే.. వైద్యులు ప్రేగు లేదా కడుపులోని ఒక భాగాన్ని ఉపయోగించి కొత్త మార్గాన్ని తయారు చేస్తారు. మొదట్లో ట్యూబ్ ద్వారా ఆహారం అందించినా, క్రమంగా రోగి కొత్త ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు.

మూత్రాశయం (యూరినరీ బ్లాడర్)

మూత్రాశయం మూత్రాన్ని నిల్వ చేస్తుంది. దీన్ని తొలగిస్తే కడుపులో కొత్త మార్గాన్ని చేసి, మూత్రం బయట ఉన్న ఒక బ్యాగ్‌లో చేరేలా చేస్తారు. ఇది శాశ్వత మార్పే అయినప్పటికీ, సరైన జాగ్రత్తలతో సాధారణ జీవితం గడపవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..