AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: భారత్‌పై ప్రేమతో హిందూ వివాహం.. ఇటలీ జంట పెళ్లి వేడుక వైరల్!

ప్రేమకు భాషలు, దేశాల సరిహద్దులు ఉండవని మరోసారి నిరూపించారు ఇటలీకి చెందిన ఓ జంట. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై పెంచుకున్న ఇష్టంతో ఏకంగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రేమకు చిహ్నంగా పేరొందిన ఆగ్రాలోని తాజ్‌మహల్ నగరం ఆగ్రాలో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. భారతదేశంపై వారికున్న ప్రేమను తమ పెళ్లి వేడుక ద్వారా చాటుకున్నారు.

Video: భారత్‌పై ప్రేమతో హిందూ వివాహం.. ఇటలీ జంట పెళ్లి వేడుక వైరల్!
Italian Couple Love For India Led To A Hindu Wedding In Agra
Sharada V
|

Updated on: Nov 04, 2026 | 10:29 PM

Share

ఇటలీలోని లిగూరియా ప్రాంతానికి చెందిన మాటియో, కాటెరినా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ భారతదేశమంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో గతంలో పలుమార్లు భారత్‌లో పర్యటించారు. ఒక్కోసారి వచ్చినప్పుడు ఒక్కో ప్రాంతాన్ని సందర్శిస్తూ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకున్నారు.

తమ పర్యటనలో భాగంగా హరిద్వార్‌ను సందర్శించిన ఈ జంట గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఈ ప్రయాణాలు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై వారిలో మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా సనాతన ధర్మంలోని ఆచారాలు, సంప్రదాయాలు వారిని ఆకట్టుకున్నాయి.

ఆగ్రాలో నెరవేర్చుకున్న పెళ్లి కోరిక

ఆగ్రా నగరం కూడా ఈ జంటకు కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు ఇక్కడికి వచ్చి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ను సందర్శించారు. ప్రతిసారీ ఆ పర్యటన తమకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని చెబుతున్నారు. అయితే ఈసారి మాత్రం వారి ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారింది.

ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్‌మహల్ నగరంలో తమ ప్రేమకథకు భారతీయ సంప్రదాయాల మేళవింపుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలన్నది చాలా కాలంగా వారి కోరిక. గత పర్యటనల్లోనే ఈ ఆలోచన ఉన్నప్పటికీ, అవసరమైన ఏర్పాట్లు కుదరక అది సాధ్యం కాలేదు. తాజా పర్యటనలో తమ కోరికను టూర్ కంపెనీ నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో వారు ఓ హిందూ పురోహితుడిని సంప్రదించగా, ఆయన సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించేందుకు అంగీకరించారు.

వేద మంత్రాల సాక్షిగా హిందూ వివాహం

మంగళవారం రాత్రి సుమారు 7 గంటలకు ఈ వివాహ వేడుక ప్రారంభమైంది. మాటియో, కాటెరినా సంప్రదాయ భారతీయ పెళ్లి దుస్తుల్లో వేడుకకు హాజరయ్యారు. పురోహితుడి మార్గదర్శకత్వంలో హిందూ వివాహ ఆచారాలను పాటించారు. వేద మంత్రాలు, సంప్రదాయ పద్ధతులతో పెళ్లి వేడుక కొనసాగింది. ఈ ఆచారాల వెనుక ఉన్న అర్థాలను కూడా తెలుసుకోవాలనుకున్న ఈ జంట కోసం పురోహితుడు హిందీతో పాటు ఇంగ్లిష్‌లోనూ మంత్రాల అర్థాలను వివరించారు.

వివాహంలో భాగంగా మాటియో తన భార్య కాటెరినా నుదుటి పాపిట్లో సింధూరం దిద్దారు. అనంతరం ఆమె మెడలో మంగళసూత్రం కట్టారు. హిందూ వివాహ సంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రెండు ఆచారాలను పాటిస్తూ ఒక్కటయ్యారు. ఇలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న అభిమానాన్ని మాటియో, కాటెరినా ఓ అందమైన జ్ఞాపకంగా మలుచుకున్నారు. ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్‌మహల్ నగరంలో వారి వివాహం మరో ప్రత్యేకమైన ప్రేమకథగా నిలిచిపోయింది.

Follow Us