
పెహల్గామ్ ఉగ్ర ఘటనకు బదులుగా పాకిస్థాన్‌లోని ఉగ్ర, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పైచేయి సాధించింది. పాకిస్తాన్‌కు చావు దెబ్బ తగిలింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, సైన్యం, సైనిక విమానాలు, ఫైటర్ జెట్లు సహా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌లో కీలకపాత్ర పోషించింది మన సరిహద్దు భద్రతాదళం. సైన్యంతో పాటు బీఎస్‌ఎఫ్ వీరోచిత పోరాటంతో పాక్ రేంజర్లు కాలికి బుద్ధిచెప్పారు. మొత్తం 70 పాకిస్తాన్ బోర్డర్ ఔట్‌పోస్టులతో పాటు, 42 ఫార్వర్డ్ లొకేషన్లను BSF ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాక్ రేంజర్లు గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. సుందర్బని సెక్టార్ ఎదురుగా ఉన్న ISI లాంచ్‌ప్యాడ్‌ని నామరూపాల్లేకుండా చేసింది. బీఎస్‌ఎఫ్ పోరాటంలో మహిళా జవాన్లు కూడా భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో ఓ పదేళ్ల బాలుడు సైన్యం దృష్టిని ఆకర్షించాడు. యుద్ధంలో పాక్ దాడులను మన సైన్యం దీటుగా తిప్పికొడుతున్న వేళ.. భారత సైన్యానికి ఓ పదేళ్ల బాలుడు సపోర్ట్‌గా నిలిచాడు. సైనికులకు మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ ఆపరేషన్‌లో తాను సైతం ఉన్నానని చాటుకున్నాడు. బాలుడి సేవలను గుర్తించిన స్థానిక సైనికాధికారులు ఇటీవల ఆ బాలుడిని సత్కరించారు.
అంతర్జాతీయ సరిహద్దుకు 2 కి.మీ దూరంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లా తారావాలీ గ్రామం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. శత్రు దేశంతో భారత సైన్యం తలపడుతున్న వేళ.. అదే గ్రామానికి చెందిన శ్రవణ్ సింగ్ అనే పదేళ్ల కుర్రాడు సైనికులకు తోడుగా నిలిచాడు. వాళ్లు అడగకముందే.. వారికి మంచినీరు, ఐస్, చాయ్, పాలతోపాటు లస్సీ ఇతర ఆహార పదార్థాలను అందించే పనిని భుజానికెత్తుకున్నాడు. ఇది గమనించిన స్థానిక విభాగం కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్.. ఆ బాలుడిని ప్రశంసలతో ముంచెత్తారు.
తమ కుమారుడిని చూస్తుంటే గర్వంగా ఉందని, సైనికులు కూడా తమ బిడ్డను ఇష్టపడుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శ్రవణ్ తండ్రి అన్నారు. నాలుగో తరగతి చదువుతున్న అతడికి ఆ పనులు చేయాలని ఎవ్వరూ చెప్పలేదని, సొంతగా అతడే చేశాడని చెప్పారు. పెద్దయ్యాక తానూ సైనికుడిని అవుతా. దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నా అని శ్రవణ్ సింగ్ తెలపడం విశేషం.
#IndianArmy honours little boy Shravan Singh, who helped soldiers in Amritsar border by bringing water, milk, lassi, ice from his house during #operation_sindoor .#Sardar for a reason. Nation First! pic.twitter.com/1r686sFpYV
— Major Madhan Kumar 🇮🇳 (@major_madhan) May 28, 2025