
మన దేశంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లే, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా ఆందోళనకరంగా మారుతుంది. ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడమే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం. సాధారణంగా మనం రోడ్లపై ప్రయాణించేటప్పుడు మధ్యలో లేదా పక్కన వేర్వేరు రకాల తెల్లటి, పసుపు రంగు లైన్స్ చూస్తుంటాం. చాలామంది వీటిని కేవలం రోడ్డు అందం కోసం వేసినవని అనుకుంటారు. కానీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ప్రతి గీతకు ఒక నిర్దిష్టమైన అర్థం, చట్టపరమైన రూల్ ఉంది. వీటిని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల బారిన పడకుండా, సురక్షితంగా ప్రయాణించడానికి ఈ రోడ్డు మార్కింగ్స్ వెనుక ఉన్న అసలు అర్థాలు ఇవే..
రోడ్డు మధ్యలో చిన్న చిన్న గ్యాప్‌లతో ఉండే తెల్లటి గీతలు ఉంటే, ఆ రోడ్డుపై మీరు లేన్ మార్చుకోవచ్చని అర్థం. వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ, సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వేరే వాహనాన్ని ఓవర్‌టేక్ చేయవచ్చు లేదా యూ టర్న్ తీసుకోవచ్చు.
రోడ్డు మధ్యలో ఎక్కడా బ్రేక్ లేకుండా నేరుగా సాగిపోయే తెల్లటి లైన్ ఉంటే, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్కింగ్ ఉన్న చోట లేన్ మారడం కానీ, ఓవర్‌టేక్ చేయడం కానీ, యూటర్న్ తీసుకోవడం కానీ పూర్తిగా నిషేధం. మీరు ఏ లేన్‌లో వెళ్తున్నారో అదే లేన్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ఘాట్ రోడ్లు, మలుపుల్లో ఇవి ఉంటాయి.
రోడ్డుపై పసుపు రంగులో నాన్ స్టాప్ గీత ఉంటే.. అక్కడ ఓవర్‌టేక్ చేయడానికి అనుమతి ఉంటుంది కానీ మీ లేన్‌ను దాటి అవతలి వైపునకు వెళ్లడానికి వీల్లేదు. అంటే పసుపు గీత లోపల ఉంటూనే వేరే వాహనాన్ని దాటవచ్చు. అయితే వేర్వేరు రాష్ట్రాల్లో ఈ నియమాన్ని స్థానిక ట్రాఫిక్ పరిస్థితులను బట్టి కాస్త భిన్నంగా అమలు చేస్తుంటారు.
రోడ్డు మధ్యలో పక్కపక్కనే రెండు పసుపు రంగు గీతలు ఉంటే.. అది అత్యంత కఠినమైన నియమంగా భావించాలి. ఈ గీతలను దాటడం అంటే ఒక రకమైన డివైడర్‌ను దాటడంతో సమానం. ఇక్కడ ఓవర్‌టేక్ చేయడం, లేన్ మారడం, యూటర్న్ తీసుకోవడం అస్సలు కుదరదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ప్రమాదకరమైన డ్రైవింగ్ కింద భారీ చలాన్ విధిస్తారు.
రోడ్డుపై పక్కపక్కనే ఒక నిరంతర గీత, మరో విరిగిపోయిన గీత కలిసి ఉంటే.. మీరు ఏ వైపున ప్రయాణిస్తున్నారనేది ముఖ్యం. మీ వాహనం విరిగిపోయిన గీత ఉన్న వైపు ఉంటే, మీరు అవసరమైతే ఓవర్‌టేక్ చేయవచ్చు. అదే మీ వాహనం నాన్ స్టాప్ గీత వైపు ఉంటే మీరు ఓవర్‌టేక్ చేయడానికి లేదా లేన్ మారడానికి వీల్లేదు.
భారతీయ మోటార్ వాహనాల చట్టం ప్రకారం రోడ్డు మార్కింగ్స్‌ను ఉల్లంఘించడం తీవ్రమైన నేరం. ఇలా నిబంధనలు దాటి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా విధించడమే కాకుండా ప్రమాద తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం మరియు జైలు శిక్ష విధించేందుకు కూడా చట్టంలో నిబంధనలు ఉన్నాయి.