దట్టంగా మంచు కురుస్తుంటే, ఆ కురిసే మంచులో మనం ఉంటే ఎలా ఉంటుంది.. ఒకసారి బోస్నియాను చూడండి. మంచు గుట్టలుగా పేరుకుపోయింది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై ఎక్కడ చూసినా భారీగా మంచు కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి. దట్టంగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మంచు తుఫాను కారణంగా మంగళవారం బోస్నియా, హెర్జెగోవినాలోని కొన్ని ప్రాంతాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.. దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు విద్యుత్తు లేకుండా ఇళ్లల్లోనే ఉండి పోయారని అధికారులు తెలిపారు.
రాజధాని మొత్తం మంచు దుప్పటి కప్పేసింది. రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రహదారులు అర అడుగు నుంచి ఒక అడుగు మేర మంచుతో నిండిపోయాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. పలు రహదారులను మూసివేశారు.
మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. ద్రాస్, గుల్మార్గ్, పహల్గా వంటి ప్రాంతాల్లోని కొండలు, లోయలు..మంచు అందాలను సంతరించుకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ..మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. జమ్ముకశ్మీర్‌కు పర్యాటకులు క్యూ కడుతున్నారు. క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటికే కశ్మీర్ చేరుకుంటున్న పర్యాటకులు.. మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. కనుచూపుమేర ఎటు చూసినా హిమపాతమే కనిపిస్తోంది. పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతూ పర్యాటకులను మురిపిస్తున్నాయి. దొడ, బందిపొరా, ద్రాస్, కార్గిల్, సోనామార్గ్, జోజిలా పాస్ ఏరియాల్లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది. దీంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది.