
పాము అంటేనే భయం. అది బతికి ఉన్నా, చనిపోయినా దాని దగ్గరికి వెళ్లడానికి చాలా మంది భయపడతారు. ఎందుకంటే పాము చనిపోయిన తర్వాత కూడా దాని కాటు వేసే సామర్థ్యాన్ని కోల్పోదు. అవును.. చనిపోయిన పాము కూడా కరవగలదు అనేది కేవలం మాట కాదు.. ఇది శాస్త్రీయంగా కూడా నిజం. చాలామందికి ఈ విషయం తెలియదు. మరి, ఇది ఎలా సాధ్యమో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పాము చనిపోయినా దాని శరీరంలోని కండరాలు కొంత సమయం వరకు పని చేస్తూనే ఉంటాయి. ఇది ఒక రకమైన ప్రతిచర్య లాంటిది. పాము తల తెగిన తర్వాత కూడా దానిని తాకితే, నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనలు ఏర్పడి కండరాలు ప్రతిస్పందిస్తాయి. దీనివల్ల పాము నోరు తెరిచి కాటు వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, దాని తలకు హాని కలిగినప్పుడు లేదా శరీరం తెగినప్పుడు ఈ ప్రతిచర్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు కాటు వల్ల విషం విడుదలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
చనిపోయిన పాము కాటు కూడా బతికి ఉన్న పాము కాటులాగే ప్రమాదకరం. ఎందుకంటే దాని విష గ్రంథులు అలాగే ఉంటాయి. విషాన్ని బయటకు పంపే సామర్థ్యాన్ని అవి కోల్పోవు. కాటు వేసినప్పుడు విషం శరీరంలోకి చేరి, మనిషి ప్రాణానికి ప్రమాదం కలిగించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
ఇటీవలే అస్సాంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన కోబ్రాను పట్టుకున్నప్పుడు దాని కాటుకు గురయ్యారు. వారికి సకాలంలో వైద్యం అందించడంతో కోలుకున్నారు. ఈ సంఘటనలు చనిపోయిన పాములు కూడా ఎంత ప్రమాదకరంగా ఉండగలవో నిరూపిస్తున్నాయి. సాధారణంగా మరణించిన తర్వాత వాటి కండరాలు ఒక నిర్దిష్ట కాలం వరకు రిఫ్లెక్స్ చర్యలు చూపగలవు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, చనిపోయిన పాములను కూడా సురక్షితమైన దూరంలో ఉంచి జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..