
పోలాండ్‌లోని బొచ్నియా అరణ్య ప్రాంతంలో చారిత్రక నేపథ్యం ఉన్న అరుదైన సంపద బయటపడింది. 600కి పైగా మధ్యయుగ నాణేల ఖజానా మెటల్ డిటెక్టర్ అన్వేషకులు వెలికితీశారు. వీటిలో వెండి నాణేలతో పాటు అరుదైన బంగారు డుకాట్లు(అప్పట్లో యూరప్ అంతటా చలామణి అయిన అత్యంత విలువైన బంగారు నాణేలు) కూడా ఉన్నాయి. దక్షిణ పోలాండ్‌లోని రాబా నది ఒడ్డున ఉన్న బొచ్నియా పట్టణం పరిసరాల్లోని అడవిలో మెటల్ డిటెక్టర్లతో సర్వే చేస్తూ… కొందరు అన్వేషకులు మట్టిలో పాతుకుపోయిన సెరామిక్ కుండలో నాణేలను కనుగొన్నారు. వెంటనే అధికారులు సమాచారం అందించారు. టార్నోవ్ వారసత్వ విభాగం ఆధ్వర్యంలో… బొచ్నియా ఫిషర్ మ్యూజియం నిపుణులు, క్రాకోవ్‌లోని ఏజిహెచ్ యూనివర్సిటీ సహకారంతో నాణేల తవ్వకాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు.
దొరికిన కండలో.. 592 వెండి జాగిలోనియన్ డెనారీలు, 26 హాఫ్-గ్రోషెన్ నాణేలు, 4 బంగారు డుకాట్లు బయటపడ్డాయి. ఈ బంగారు నాణేలు 1387 నుంచి 1437 వరకు పాలించిన సిగిస్మండ్ ఆఫ్ లక్సెంబర్గ్ కాలానికి చెందినవని నిపుణులు చెబుతున్నారు. ఆయన ఒకప్పుడు హోలీ రోమన్ ఎమ్పెరర్ మాత్రమే కాకుండా హంగేరీ, బోహేమియా రాజుగానూ పాలించారు. ఆ కాలంలో బొచ్నియా పట్టణం వాణిజ్యానికి ఒక ముఖ్య కేంద్రం. ముఖ్యంగా అక్కడి రాజకుటుంబ ఉప్పు గనులు యూరప్ అంతటా వాణిజ్యానికి దోహదం చేశాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ నిధి ఒక వ్యాపారవేత్త దాచుకున్నది అవ్వొచ్చు. లేదా రాజకీయ కల్లోల సమయంలో దాచిపెట్టిన అత్యవసర నిధి కావచ్చు.
ప్రస్తుతం నాణేలను స్టానిస్లావ్ ఫిషర్ మ్యూజియంలో శాస్త్రీయ సంరక్షణలో ఉంచారు. వాటి విలువ లెక్కింపు పూర్తి అయిన తర్వాత ప్రజలకు శాశ్వత ప్రదర్శనగా అందుబాటులో ఉంచనున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..