
ఒక్కసారి ఊహించుకోండి… మీరు నిద్రలోంచి కళ్ళు తెరిచి చూసే సరికి.. మీరు చల్లని, చీకటి, మూసి ఉన్న ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుందో..! వామ్మో ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైకి పోయినంత పనవుతుంది. భయంతో గట్టిగా కేకలు వేస్తాం. కానీ, మీ గొంతు ఆ చీకటి గదిలోంచి బయటకు రాదు..మీరు కదలడానికి ప్రయత్నిస్తారు, కానీ, మీ శరీరం చలితో మొద్దుబారిపోయి ఉంటుంది. మీరు బతికే ఉంటారు.. కానీ, చనిపోయిన వారి శరీరాలను భద్రపరిచే ప్రదేశంలో చిక్కుకున్నారని మీరు నెమ్మదిగా గ్రహిస్తారు. ఈ భయంకరమైన అనుభవం ఓ 80 ఏళ్ల వృద్ధురాలికి ఎదురైంది. మరియా డి జీసస్ అర్రోయో అనే వృద్ధురాలు బతికి ఉండగానే మార్చురీలోని ఫ్రీజర్‌లో బంధించబడింది. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒక నివేదిక ప్రకారం, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని బాయిల్ హైట్స్ ప్రాంతానికి చెందిన మరియా అనే మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పొరపాటున ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆమెను ఒక బాడీ బ్యాగ్‌లో ఉంచి రిఫ్రిజిరేటెడ్ ఫ్రీజర్‌లో ఉంచారు. అయితే, కొద్దిసేపటికే ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. ఫ్రీజర్ లోపల సజీవంగా కనిపించింది.
పాథాలజిస్ట్ డాక్టర్ మారియా ప్రకారం, ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తనను తాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ గడ్డకట్టే చలి ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. ఆమె ముఖం, చర్మం, గోళ్లపై ఆమె చేసిన పోరాట గుర్తులు కనిపించాయి. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉందని, కానీ చివరికి చలికి లొంగిపోయిందని సూచిస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఫ్యూనరల్ హోమ్ సిబ్బంది వచ్చారు. అక్కడ ఆమె పరిస్థితిని చూసిన వారంతా షాక్ అయ్యారు. బాడీ బ్యాగ్ సగం తెరిచి ఉంది. మరియా ముఖం మీద పడి ఉంది. ఆమె ముఖం మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఆమె బతికి ఉండగానే ప్రమాదవశాత్తు ఫ్రీజర్‌లో ఉంచబడిందని స్పష్టమైంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మరియా చనిపోయిందంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిపై కేసు వేశారు. మా అమ్మ గుండెపోటుతో చనిపోలేదు, చలి వల్లే చనిపోయారు. ఆమె బతికి ఉండగానే ఫ్రీజర్‌లో ఉంచారంటూ మరియా పిల్లలు ఆరోపించారు.
గతంలో కోర్టు ఈ కేసును క్లోజ్ చేసినప్పటికీ పరిమితుల చట్టం ముగిసిపోయిందని పేర్కొంటూ కాలిఫోర్నియా సెకండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇప్పుడు కేసును తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. కోర్టు ఇలా పేర్కొంది, ఆ మహిళ బతికే ఉందని కుటుంబానికి తెలుసుకునే అవకాశం లేదు, కాబట్టి కేసును మళ్ళీ విచారిస్తామని చెప్పింది. కోర్టు నిర్ణయంతో ఆ కుటుంబానికి న్యాయం పట్ల కొత్త ఆశను కలిగించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..