Viral Video: అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

పర్యాటకుల స్వర్గధామం బాలి ద్వీపం ఇప్పుడు వరద బీభత్సంతో వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వీధులన్నీ బురద నీటితో నిండిపోగా.. ఏకంగా భారీ కొండచిలువలు రోడ్లపై ఈదుతూ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Gaint Python Swimming In Bali Floodwaters

Updated on: Feb 27, 2026 | 7:50 PM

ఇండోనేషియాలోని ప్రసిద్ధ పర్యాటక ద్వీపం బాలిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న ఈ వర్షాలకు ద్వీపం మొత్తం జలమయమైంది. జనజీవనం స్తంభించిపోగా, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటా, లెజియన్, సెమిన్యాక్, కాంగ్గు వంటి అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వీధులన్నీ బురద నీటితో మోకాలి లోతు నదులను తలపిస్తున్నాయి. ఇళ్లు, దుకాణాలు, అతిథి గృహాలలోకి భారీగా నీరు చేరడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. నదులు పొంగిపొర్లుతుండటంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

వీధిలో ఈదుతున్న భారీ కొండచిలువ

వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా బురద నీటితో నిండిన రోడ్డుపై 6 అడుగుల భారీ కొండచిలువ ఈదుతూ వెళ్తున్న దృశ్యం స్థానికులను, పర్యాటకులను భయాందోళనలకు గురిచేస్తోంది. “కూటా వీధుల్లో భారీ కొండచిలువలు తిరుగుతున్నాయి” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

పర్యాటకంపై తీవ్ర ప్రభావం

ఈ ప్రకృతి విపత్తు పర్యాటక రంగాన్ని అతలాకుతలం చేసింది. వరదల్లో విల్లాలు మునిగిపోవడంతో పర్యాటకులు ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు. చాలామంది తమ ప్రయాణ జాబితా నుండి బాలిని తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇండోనేషియా వాతావరణ సంస్థ అధికారుల ప్రకారం.. రుతుపవనాల కారణంగా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలు ఏప్రిల్ ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Follow Us