
నేరం చేస్తే దొంగలను పోలీసులు పట్టుకుంటారు.. కానీ ఇక్కడ దొంగలే పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో పెట్టారు. అవును ఇది నిజం. నోయినాడాలో నకిలీ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసి డొనేషన్లు వసూలు చేస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా సేవకులమని నటిస్తూ వెబ్‌సైట్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు కొందరు యువకులు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ ధృవపత్రాలను ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. అంతర్జాతీయ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేరుతో నకిలీ కార్యాలయాన్ని నడుపుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసుల చిహ్నాలను ఉపయోగించి డబ్బును దోచుకుంటున్నారు ఈ కేటుగాళ్లు.
నోయిడాలోని ఫేజ్ 3 ప్రాంతంలో నకిలీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ సభ్యులుగా నటిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవలే కార్యాలయం ప్రారంభించారని, నెట్‌వర్క్ మరింత విస్తరించకముందే క్లోజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. నిందితుల ఆఫీస్ నుంచి నకిలీ ఐడీలు, అధికారికంగా కనిపించే పత్రాలు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సెటప్ ఘజియాబాద్‌లో ఇటీవల పట్టుకున్న నకిలీ ఎంబసీ కేసు తరహాలో ఉందని దర్యాప్తు అధికారులు అంటున్నారు. నిందితులు విభాష్, ఆరాగ్య, బాబుల్, పింటుపాల్, సంపమ్ డాల్, ఆశిష్ పశ్చిమ బెంగాల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు తమని తాము అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ అధికారులుగా చెప్పుకునే వారని, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, విచారణల పేరిట అమాయకులను బురిడీ కొట్టించేవారని పోలీసులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..