Dantewada: బావి నుంచి నీరుకి బదులు పెట్రోల్.. బకెట్లతో బారులు తీరిన ప్రజలు.. రీజన్ ఏమిటంటే

|

Nov 15, 2024 | 1:02 PM

రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలోని ఓ బావిలోంచి అకస్మాత్తుగా పెట్రోలు బయటకు రావడం ప్రారంభించినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఈ బావిలో నుంచి బకెట్ల ద్వారా పెట్రోల్‌ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు బావిలో నుంచి పెట్రోలు రావడానికి గల కారణాన్ని పోలీసులు గుర్తించారు.

Dantewada: బావి నుంచి నీరుకి బదులు పెట్రోల్.. బకెట్లతో బారులు తీరిన ప్రజలు.. రీజన్ ఏమిటంటే
Petrol Came Out From Well
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గత రెండు రోజులుగా ఓ సంఘటన కారణంలో వార్తల్లో నిలుస్తుంది. అక్కడ ఓ ఇంట్లో ఉన్న బావిలో నుంచి నీళ్లకు బదులు పెట్రోల్ వస్తోంది. ప్రజలకు ఈ విషయం తెలిసింది. దీంతో బావి నుంచి పెట్రోలు తీసుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు బావి దగ్గరకు చేరుకోవడం ప్రారంభించారు. ఆనోటా ఈ నోటా ఈ విషయం పోలీసులకు చేరింది. వెంటనే బావి దగ్గరకు చేరుకొని ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. తదనంతరం బావి నుంచి ఎలా పెట్రోల్ వస్తుంది అనే విషయంపై విచారణ చేపట్టారు. ఆపై విచారణలో వెలుగుచూసిన విషయం పోలీసులను విస్మయానికి గురిచేసింది.

ఈ ఘటన గీడం ప్రాంతానికి సంబంధించినది. భోలు జైన్ కుటుంబం ఓ ఇంట్లో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం అంటే బుధవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు నీటి కోసం ప్రాంగణంలోని బావిలో బకెట్ వేశారు. బావి నుంచి బకెట్ బయటకు తీయగానే అతనికి నీరు వింతగా కనిపించింది. నీరు రంగు కూడా భిన్నంగా ఉందని గుర్తించిన ఆ వ్యక్తీ ఇంధనం లాగా ఉందని భావించాడు. కొంత సేపు పరిశీలించిన తర్వాత తెలిసింది బకెట్ లో ఉంది నీరు కాదు పెట్రోల్ అని. కొద్దిసేపటికే ఆ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

బావిలోంచి పెట్రోలు బయటకు వస్తోంది… ఇది విన్న జనం భారీ సంఖ్యలో తమ ఇళ్ల నుంచి బకెట్లతో బావి వద్దరావడం ప్రారంభించారు. పెట్రోలు కోసం ఆ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఇంటి దగ్గర పెద్ద క్యూలు మొదలయ్యాయి. అవును పెట్రోల్ ఉచితంగా దొరుకుతుంది అంటే ఎవరికీ ఆశ పుట్టదు చెప్పండి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇంటికి చేరుకున్నారు. ఈ విషయంపై విచారణ జరిపేందుకు వీలుగా వారు ఇంటిని, ప్రాంతాన్ని సీలు చేశారు.

పెట్రోల్ చోరీ కేసు

ఆ తర్వాత ఓ కేసుపై పోలీసుల దృష్టి పడింది. కొద్దిరోజుల క్రితం పెట్రోల్‌ పంప్‌ యజమాని ఈ కేసుని రిజిస్టర్‌ చేశారు. పాత బస్టాండ్‌లోని బఫ్నా పెట్రోల్ పంపు యజమాని తన స్థలంలో ప్రతిరోజూ పెట్రోల్ దొంగిలిస్తున్నారని చెప్పారు. పోలీసులు ఈ కేసును ఆ కేసుతో ముడిపెట్టి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఎవరైనా అగంతకులు పెట్రోల్‌ను దొంగిలించి ఈ బావిలో పోస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే పోలీసుల ఈ అనుమానం తప్పని తేలింది.

అసలు కారణం ఏమిటంటే

అనంతరం మరో కోణంలో విచారణ కొనసాగించారు. మర్నాడు అంటే గురువారం పోలీసులు బావిలోని నీరు పెట్రోల్ గా మారడానికి గల కారణాన్ని గుర్తించారు. ఈ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఒక పెట్రోల్ పంపు ట్యాంక్ ఉంది. అక్కడున్న పెట్రోల్‌ పంపు ట్యాంక్‌ లీక్‌ అయింది. దీంతో ఆ పెట్రోల్ భూమిలోకి ఇంకిపోయి ఈ బావికి చేరింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగ్నిమాపక దళం, పోలీసులను ఇంటి చుట్టూ మోహరించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాదు పెట్రోల్ పంప్ ట్యాంక్ మరమ్మతు పనులు కూడా చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..