
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ చేశారు. బయటి ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని ఓ చిన్న ఖండం ఒకటి గ్రీన్లాండ్ సమీపంలో బయటపడింది. ఇది గ్రీన్లాండ్, కెనడా మధ్య ఉన్న డేవిస్ జలసంధి కింద దాగి ఉన్న ఒక చిన్న కొత్త ఖండాన్ని గుర్తించారు. ఈ ఆవిష్కరణ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచడమే కాకుండా భూమి టెక్టోనిక్ ప్లేట్ల చరిత్రను మనం అర్థం చేసుకునే విధానాన్ని కూడా మార్చివేసేలా ఉంది. ఇకపోతే, ఈ కొత్త ఖండానికి శాస్త్రవేత్తలు డేవిస్ స్ట్రెయిట్ ప్రోటో-మైక్రోకాంటినెంట్ అని పేరు పెట్టారు. వాస్తవానికి ఇది దాదాపు 33 నుండి 61 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఖండాంతర క్రస్ట్‌లోని ఒక భాగం. ఇది దాదాపు 12 నుండి 15 మైళ్లు (19–24 కి.మీ) మందంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం అడుగున ఉంది.
దాన్ని ఎలా కనుగొన్నారు?
UK లోని డెర్బీ విశ్వవిద్యాలయం, స్వీడన్ లోని ఉప్ప్సల విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ ఆవిష్కరణను చేశారు. వారు ఉపగ్రహ గురుత్వాకర్షణ డేటా, భూకంప ప్రతిబింబ డేటాను ఉపయోగించి ఈ ప్రాంతం వివరణాత్మక మ్యాప్‌ను రూపొందించారు.
ఇది ఎలా జరిగింది?
పరిశోధన ప్రకారం, మిలియన్ల సంవత్సరాల క్రితం గ్రీన్లాండ్, ఉత్తర అమెరికా (కెనడా) విడిపోతున్నప్పుడు భూమి టెక్టోనిక్ ప్లేట్లలో భారీ కదలిక జరిగింది. 61 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రీన్లాండ్, ఉత్తర అమెరికా మధ్య చీలిక ప్రారంభమైంది. 58-49 మిలియన్ సంవత్సరాల క్రితం, టెక్టోనిక్ ప్లేట్ కదలిక దిశ మారిపోయింది. దీనివల్ల ఖండాంతర క్రస్ట్‌లో ఎక్కువ భాగం విరిగిపోయి మధ్యలో చిక్కుకుంది. ఈ ప్రక్రియ 33 మిలియన్ సంవత్సరాల క్రితం ఆగిపోయింది. ఈ భాగం సూక్ష్మ ఖండంగా ఘనీభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలకు అతి ముఖ్యమైనది..
ఈ ఆవిష్కరణ ఖండాలు ఎలా విడిపోతాయో, వాటి అవశేషాలు ఎలా సంరక్షించబడుతున్నాయో వివరిస్తుంది. ఈ దృగ్విషయం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో (ఐస్లాండ్ వంటివి) సంభవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కనిపించకుండా దాగివున్న ఇతర ఖండాలను కనుగొనడం సాధ్యమవుతుంది. టెక్టోనిక్ ప్లేట్ల గురించిన ఖచ్చితమైన జ్ఞానం భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..