Snake: రెండు తలల పాము ఇంట్లో ఉంటే ధనరాశులు పొంగిపోర్లుతాయా..?

|

Apr 28, 2024 | 4:10 PM

గుప్త నిధులను గుర్తించడంలో ఈ పాము సాయం చేస్తుందని కొందరు చెబుతుంటారు. రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే తక్కువ సమయంలో ధనవంతులు అవుతారని మరొకరు నమ్మబలుకుతారు. అందుకే వీటికి దేశవిదేశాల్లో విపరీతమైన డిమాండ్. అయితే ఈ పాములపై ఉన్న ప్రచారంలో నిజమెంత..?

Snake: రెండు తలల పాము ఇంట్లో ఉంటే ధనరాశులు పొంగిపోర్లుతాయా..?
Two Headed Snake
Follow us on

పాము కనిపించగానే ఎవరైనా సరే వణికిపోతారు. అక్కడి నుంచి పరిగెత్తుతారు. అయితే ఓ పాము ఎక్కడ దొరుకుతుందా అని కొందరు అదే పనిగా వెతుకుతున్నారు. దొరికిన వాటిని లక్షలు, కోట్లకు అమ్ముతున్నారు. కారణం ఆ పాము చుట్టూ ఉన్న ప్రచారం. రెండు తలల పాముతో సిరి కలిసి వస్తుందని చాలా ప్రాంతాల్లో నమ్ముతుంటారు. ఔషదాలు, తాంత్రిక పూజల్లో ఈ పాములను ఉపయోగిస్తుంటారు. విదేశాల్లో ఈ పాముకు చాలా డిమాండ్ ఉంది. ఈ పాము మాంసం లైంగిక శక్తిని విపరీతంగా పెంచుతుందని  చైనా, హాంగ్‌కాంగ్ దేశాల్లో నమ్ముతారు. అక్కడ వివిధ వంటకాల్లో దీనిని వేస్తారు. అలానే క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు నయం అవుతాయని కూడా రూమర్స్ ఉన్నాయి.

ఈ పామును రెండ్ శాండ్ బోవాగా పిలుస్తారు. ఈ పాములు ఎక్కువగా భారత్, ఇరాన్, పాకిస్థాన్ దేశాల్లో కనిపిస్తాయి. ఇది పూర్తిగా విషరహితమైనది. కనీసం కాటు కూడా వేయదు. 2 మీటర్లు నుంచి 3 మీటర్ల వరకు పెరుగుతాయి. రాతి, ఇసుక నేలల బొరియల్లో నివశిస్తాయి. వాస్తవానికి ఈ పాముకు రెండు తలలు ఉండవ్. ఈ పాముల తోక కూడా తల మాదిరిగా ఉంటుంది.  ఏదైనా ఆపద వచ్చినప్పుడు..  అది తన తోకను నోరులా పైకి లేపగలదు. దీని కారణంగా ప్రజలు దీనిని రెండు తలల పాముగా అపోహ పడుతుంటారు. ఇది గోధుమ, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఈ జాతికి చెందిన ఆడపాము 14 పిల్లల వరకు జన్మనిస్తుంది. ఇవి కీటకాలు, బల్లులు, చుంచులు,  ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది.

మీ ఇంట్లో ధనరాశులు పొంగి పొర్లాలా..? లక్ష్మీ దేవి తాండవం చేయాలా..? అయితే ఈ రెండు తలల పామును ఇంట్లో పెట్టుకోండి అంటూ కొందరు అక్రమార్కులు ప్రచారం చేస్తుంటారు. ఇదంతా ఫేక్. ఈ ప్రచారాన్ని అస్సలు నమ్మకండి. ఈ పాములు హాని చేయనవి. వాటిని చంపకండి.

కాగా, రెండు తలల పాముగా పిలిచే ‘రెడ్‌ సాండ్‌ బోవా’కు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీశాఖ అధికారులు కూడా తెలిపారు. దీని ద్వారా లక్ కలిసిరావటమనేది కేవలం కొందరి ప్రచారం మాత్రమే అన్నారు. ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు కంప్లైట్ చేయాలన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..