చంద్రుడిని మింగేసిన శుక్రుడు..! అంతరిక్షంలో ఏం జరిగిందో బయటపెట్టిన శాస్త్రవేత్తలు..

భూమికి తోడుగా నిలిచే చందమామ లాగే... ఒకప్పుడు శుక్ర గ్రహానికి కూడా ఒక చంద్రుడు ఉండేవాడంటే మీరు నమ్ముతారా? అవును. నిజమే.. కానీ ఆ చంద్రుడు ఇప్పుడు అంతరిక్షంలో ఎక్కడా కనిపించడు. కారణం... ఆ రాక్షస గ్రహం తన సొంత చంద్రుడినే నిలువునా మింగేసింది. వినడానికి ఏదో హాలీవుడ్ కథలా అనిపిస్తున్నా, నాసా పరిశోధనలు, కంప్యూటర్ సిమ్యులేషన్లు ఇదే నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి.

చంద్రుడిని మింగేసిన శుక్రుడు..! అంతరిక్షంలో ఏం జరిగిందో బయటపెట్టిన శాస్త్రవేత్తలు..
Did Venus Swallow Its Own Moon
Image Credit source: AI Image

Updated on: Sep 12, 2026 | 3:13 PM

రాత్రివేళ ఆకాశంలో వెండి వెన్నెలలు కురిపించే చంద్రుడిని చూడగానే ఎవరి మనసైనా పులకరిస్తుంది. మన భూమికి తోడుగా ఒక అందమైన సహజ ఉపగ్రహం ఉంది. కానీ పరిమాణం, ద్రవ్యరాశి, రాతి నిర్మాణంలో దాదాపు భూమినే పోలి ఉండే కవల గ్రహం శుక్రుడికి మాత్రం ఒక్క చంద్రుడు కూడా లేడు. సౌర కుటుంబంలో బుధుడు , శుక్రుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలకూ ఉపగ్రహాలు ఉన్నాయి. అసలు శుక్రుడికి ఆది నుంచీ చంద్రుడే లేదా? లేక ఏమైనా జరిగిందా? అనే ప్రశ్నకు తాజా ఖగోళ పరిశోధనలు ఆశ్చర్యపోయే సమాధానాన్ని వెల్లడించాయి. బిలియన్ల ఏళ్ల క్రితం శుక్రుడికి కూడా ఒక చంద్రుడు ఉండేవాడని, అయితే ఆ గ్రహమే తన సొంత చంద్రుడిని మింగేసిందని పరిశోధకులు తేల్చారు.

సైన్స్ ఫిక్షన్‌ను తలపించే అంతరిక్ష వాస్తవం

కాలిఫోర్నియా రివర్స్‌సైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధకుడు స్టీఫెన్ ఆర్. కేన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ మిస్టరీపై సమగ్ర అధ్యయనం చేపట్టింది. భూమి ప్రారంభ దశలో ఒక భారీ గ్రహశకలం ఢీకొనడం వల్ల ఏర్పడిన శిథిలాల నుంచే మన చంద్రుడు పుట్టాడు. అదే తరహాలో సౌర వ్యవస్థ తొలినాళ్లలో శుక్ర గ్రహాన్ని కూడా భారీ ఖగోళ శకలాలు ఢీకొట్టి ఉంటాయని, తద్వారా దానికి కూడా ఒక సహజ ఉపగ్రహం ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే మన చంద్రుడికి పట్టిన అదృష్టం శుక్రుడి చంద్రుడికి దక్కలేదు. భూమికి, చంద్రుడికి మధ్య ఉండే టైడల్ శక్తుల వల్ల మన చంద్రుడు ఏటా కొన్ని సెంటీమీటర్ల మేర భూమి నుంచి క్రమంగా దూరంగా జరుగుతున్నాడు. కానీ శుక్రుడి విషయంలో కథ పూర్తిగా తలకిందులైంది.

సిమ్యులేషన్లలో బయటపడిన వినాశనం

స్టీఫెన్ కేన్ బృందం శుక్రుడు, దాని ఊహాజనిత చంద్రుడు, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సంబంధాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాల ఆధారంగా కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా విశ్లేషించింది. శుక్రుడి ఆత్మభ్రమణం చాలా విచిత్రమైనది. అది సూర్యుడి చుట్టూ తిరిగే దిశకు వ్యతిరేక దిశలో, అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది. శుక్రుడిపై ఒక్క రోజు గడవడానికి భూమి లెక్కన దాదాపు 243 రోజులు పడుతుంది.

ఈ విపరీతమైన మందకొడి భ్రమణం వల్ల, ఆ చంద్రుడు గ్రహం నుంచి దూరం వెళ్లడానికి బదులుగా, దగ్గరికి రావడం జరిగింది. చంద్రుడి ద్రవ్యరాశి పెరిగేకొద్దీ, అది శుక్రుడి భ్రమణ శక్తిని మరింత వేగంగా హరించి వేసింది. ఫలితంగా చంద్రుడు క్రమంగా గ్రహం వైపునకు వస్తూ, శుక్రుడి తీవ్రమైన గురుత్వాకర్షణ టైడల్ శక్తుల ఒత్తిడికి తాళలేక ముక్కలై చివరకు గ్రహం అంతర్భాగంలో కలిసిపోయింది.

చంద్రుడు బతకాలంటే ఉండాల్సిన షరతులు

కంప్యూటర్ నమూనాల ప్రకారం.. శుక్రుడి చంద్రుడు శాశ్వతంగా మనుగడ సాగించాలంటే రెండు ప్రధాన నిబంధనలు నెరవేరాల్సి ఉండేది. ఉపగ్రహం ఏర్పడే సమయానికి శుక్రుడు చాలా వేగంగా తిరుగుతూ ఉండాలి. ఆ చంద్రుడి ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే అది గురుత్వాకర్షణ సంకెళ్లను దాటి స్థిరమైన కక్ష్యలోకి వెళ్లగలిగేది. కానీ శుక్రుడి ప్రారంభ దశ పరిస్థితులు వీటికి భిన్నంగా ఉండటంతో చంద్రుడి వినాశనం అనివార్యమైంది.

నిరూపించనున్న నాసా డావిన్సీ మిషన్

కోట్లాది సంవత్సరాల క్రితం శుక్రుడిలో కలిసిపోయిన చంద్రుడి అవశేషాలను నేటి టెలిస్కోపులతో నేరుగా చూడలేం. అయితే ఆ శకలాలు శుక్రుడి వాతావరణంలో లేదా ఉపరితలంపై ప్రత్యేకమైన రసాయన ఆనవాళ్లను వదిలివేసే అవకాశం ఉంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా డావిన్సీ ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. ఈ వ్యోమనౌక శుక్రుడి దట్టమైన సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలను చీల్చుకుంటూ వెళ్లి, అక్కడి వాతావరణం, రసాయన నిర్మాణం, అంతర్భాగ విశేషాలను కూలంకషంగా అధ్యయనం చేయనుంది. ఆ సమాచారంతో ఈ అధ్యయన నమూనాకు తిరుగులేని రుజువులు లభించనున్నాయి.

ఎక్సోప్లానెట్ల పరిశోధనలకు కొత్త దిక్సూచి

ఈ పరిశోధన కేవలం శుక్ర గ్రహానికే పరిమితం కాలేదు. మన సౌర వ్యవస్థ బయట ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే బాహ్య గ్రహాల అధ్యయనానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. నెమ్మదిగా తిరిగే గ్రహాలకు పెద్ద చంద్రులు ఉండే అవకాశం దాదాపు శూన్యమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఖగోళ భౌతికశాస్త్రంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరకడమే కాకుండా ఇతర నక్షత్ర మండలాల్లో నివాసయోగ్య గ్రహాల అన్వేషణకు ఈ పరిశోధన సరికొత్త మార్గాన్ని చూపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us