Trending Video: అతనికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. మృత్యువును తృటిలో తప్పించుకున్నాడు. రోడ్డు మీద బైక్‌పై వేగంగా వెళ్తున్న వ్యక్తిని.. ఓ జింక గాల్లో నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు.. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. అదే సమయంల, జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ జింకకు సంబంధించిన షాకింగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఆడవి గుండా వెళ్తున్న బైక్ రైడర్‌ను జింక బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. మీరు ద్విచక్ర వాహనంపై అటవీ ప్రాంతాల గుండా వెళుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇటువంటి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఇన్సిడెంట్ అంతా గాయపడ్డ వ్యక్తి వెనుక నుంచి వస్తున్న మరో బైకర్ కెమెరాకు చిక్కింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ ఉక్వా సమ్నాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇందులో జింక అకస్మాత్తుగా రహదారికి ఒక వైపు నుంచి మరో వైపుకు దూకేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మధ్యలో బైక్ రావడంతో అనుకోకుండా అతడికి తగిలింది. దీంతో ఒక్కసారిగా అతను రోడ్డుపై కుప్పకూలిపోయాడు. దీంతో అటు వైపుగా వెళ్తున్న వాహనదారులు ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.