కప్పు కాఫీ తాగి ల్యాప్‌టాప్ ఓపెన్.. కెఫె యజమానులకు కొత్త తలనొప్పి!
కాఫీ షాపులను కొందరు తాత్కాలిక ఆఫీసులుగా మార్చుకుంటున్నారు. కస్టమర్లకు ఇది సౌకర్యంగా ఉన్నా కేఫ్ యజమానులకు తలనొప్పిగా మారుతోంది. బెంగళూరులో ఓ కేఫ్ యజమాని ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.150 కాఫీ ఆర్డర్ చేసి, గంటల తరబడి టేబుళ్లను ఆక్రమించుకుంటున్న కస్టమర్ల వల్ల వ్యాపారం దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఓ వ్యక్తి రూ 60 నుంచి 70 లక్షలు పెట్టుబడి పెట్టి కెఫె ప్రారంభించారు. వ్యాపారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఓ సమస్య ఎదురైంది. అక్కడికి వచ్చే కస్టమర్లు కేవలం రూ.150 విలువైన ఒక కప్పు కాఫీ మాత్రమే ఆర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌లు తెరిచి గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నారు. కొన్నిసార్లు రోజంతా కూడా టేబుళ్లను ఆక్రమించుకుంటున్నారు.
కొత్త కస్టమర్లకు కూర్చోవడానికి చోటు లేదు!
కేఫ్‌లోని టేబుళ్లన్నీ ఇలా గంటల తరబడి కస్టమర్లతో నిండిపోవడంతో కొత్తగా వచ్చే వారికి కూర్చోవడానికి స్థలం ఉండటం లేదు. దీంతో చాలా మంది కెఫెలోకి వచ్చి సీట్లు ఖాళీగా లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఒకవైపు కాఫీ ఆర్డర్ చేసిన కస్టమర్లను వెళ్లిపోవాలని చెప్పలేరు. అలా చెబితే వారు గూగుల్‌లో నెగెటివ్ రివ్యూ ఇచ్చే అవకాశం ఉంది. దానివల్ల కెఫెకు నష్టం కలుగుతుందని యజమాని ఆందోళన చెందుతున్నారు.
కాఫీ ధరలు ఎందుకు ఎక్కువో ఇప్పుడు అర్థమవుతోంది!
ప్రముఖ కాఫీ చైన్లు స్టార్‌బక్స్, CCD, థర్డ్ వేవ్ లో కాఫీ, స్నాక్స్ ధరలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్లు కేవలం కాఫీ, స్నాక్స్ కోసమే డబ్బులు చెల్లించడం లేదు అక్కడ కూర్చుని గంటల తరబడి గడిపే సమయానికి పరోక్షంగా చెల్లిస్తున్నారు. కెఫెలో కూర్చునే స్థలానికీ ఓ ధర ఉంటుంది.
నెటిజన్లు ఇచ్చిన ఆసక్తికరమైన సలహాలు ఇవే!
ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల సూచనలు చేస్తున్నారు. కెఫెలో ఎంతసేపు ఉంటే అన్ని గంటలకు కనీసం ఒక కాఫీ ఆర్డర్ చేయాలనే నిబంధన పెట్టాలని ఓ నెటిజన్ సూచించారు. కాఫీ అమ్మడం కంటే కెఫెలో గడిపే సమయానికి డబ్బులు వసూలు చేసే విధానాన్ని తీసుకురావాలి. ఎక్కువ ధర చెల్లిస్తే మెరుగైన సీటింగ్, కాఫీ, స్నాక్స్ అందించవచ్చు అని మరికొందరు అన్నారు. కొన్ని కేఫెలలో ల్యాప్‌టాప్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. కస్టమర్లు చేసే ఖర్చును బట్టి కెఫెలో ఉండే సమయాన్ని నిర్ణయించాలి. రూ.150 నుంచి రూ.750 వరకు బిల్లు ఉంటే గరిష్ఠంగా గంటన్నర, రూ.750 నుంచి రూ 1,500 వరకు బిల్లు ఉంటే రెండు గంటల సమయం ఇవ్వొచ్చు. వారంలో ఉదయం వేళల్లో ల్యాప్‌టాప్‌లతో పని చేసేందుకు అనుమతించి, సాయంత్రాలు, వారాంతాల్లో మాత్రం ఆంక్షలు విధించాలని మరో నెటిజన్ సూచించారు. మొత్తానికి కేఫెలలో కూర్చుని పని చేసేవారి సౌకర్యం ఒకవైపు వ్యాపార నిర్వహణ మరోవైపు ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న ప్రశ్న ఇప్పుడు చర్చకు దారితీసింది. కస్టమర్లకు స్వేచ్ఛ ఉండాలా? కెఫె యజమానులు సమయ పరిమితులు విధించాలా అన్నది ఆసక్తికరంగా మారింది.