రోబోలకు ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం నేర్పించే ఉద్యోగం… నెల జీతం రూ.90 వేలు! కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ టెక్నాలజీల వేగవంతమైన విస్తరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయనే ఆందోళన నెలకొంది. అయితే, చైనాలో మాత్రం రోబోల వల్లే ఒక వినూత్నమైన ఫ్రీలాన్స్ ఉద్యోగ అవకాశం తెరపైకి వచ్చింది. మన ఇంట్లో రోజూ చేసే సాధారణ పనులైన పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం, దుస్తులు మడతపెట్టడం వంటివి రోబోలకు నేర్పించడానికి రోబోట్ ట్రైనర్స్‌ను భారీ సంఖ్యలో నియమించుకుంటున్నారు.

చైనాలో రోబోలకు గృహ పనులైన పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం, దుస్తులు మడతపెట్టడం నేర్పించడానికి రోబోట్ ట్రైనర్స్ అనే సరికొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు, విద్యార్థులు మోషన్ కాప్చర్ గేర్, సెన్సార్లు ధరించి రోజూ చేసే పనులను రికార్డ్ చేస్తూ రోబోలకు శిక్షణ ఇస్తున్నారు. దీనికిగానూ నెలకు దాదాపు రూ.50,000 నుండి రూ.90,000 వరకు సంపాదిస్తున్నారు. కానీ, చాలామంది కొద్ది వారాల్లోనే ఈ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. కారణం ఏంటంటే..
రోబోట్ ట్రైనర్ ఉద్యోగం ఎలా పనిచేస్తుంది?
ఈ ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు మోషన్ కాప్చర్ గేర్, చేతులకు సెన్సార్లు, ప్రత్యేకమైన బ్రేస్లెట్లు ధరిస్తారు. కంప్యూటర్ స్క్రీన్‌పై ఇచ్చే సూచనలను బట్టి గ్లాసులు లేదా కప్పులు తీసి పక్కన పెట్టడం, ఉపరితలాలను పదే పదే తుడవడం, ఫ్లోర్ ఊడ్చడం వంటి పనులు చేస్తారు. ఈ సమయంలో వారి శరీర కదలికలు డేటాగా రికార్డ్ అయి, మానవరహితంగా పనిచేసే హ్యూమనాయిడ్ రోబోల అల్గారిథమ్‌లను డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి.
నెల జీతం ఎంత ఉందంటే?
చైనాలోని సోషల్ మీడియా, జాబ్ పోర్టల్స్‌లో ఈ రోబోట్ ట్రైనర్ ఫ్రీలాన్స్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ పని చేసేవారు నెలకు భారతీయ కరెన్సీలో రూ.50,000 నుండి రూ.90,000 వరకు సంపాదిస్తున్నారు. షిఫ్ట్‌ల ప్రాతిపదికన డే షిఫ్ట్‌కు దాదాపు రూ.1,700, నైట్ షిఫ్ట్‌కు రూ.1,900 వరకు చెల్లిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారు, పార్ట్-టైమ్ పని వెతుక్కునే విద్యార్థులు ఈ అవకాశాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
అయినా ఉద్యోగాలు ఎందుకు వదిలేస్తున్నారు?
అంత మంచి జీతం వస్తున్నప్పటికీ, చాలామంది కొద్ది వారాల వ్యవధిలోనే ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తీవ్రమైన విసుగు, శారీరక, మానసిక అలసట. రోజుకు 160 నుండి 200 సార్లు ఒకే రకమైన పాత్రలను కడగడం, టేబుళ్లు పదే పదే తుడవడం వంటి పునరావృత పనులు చేయడం వల్ల తీవ్రమైన నిరాశకు గురవుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాల చిన్న పిల్లాడికి నేర్పించినంత సహనం అవసరమవుతోందని, చేసే శ్రమకు, పడే మానసిక ఒత్తిడికి ఇచ్చే వేతనం తక్కువగా అనిపిస్తోందని చెబుతున్నారు. త్వరలోనే రోబోలు ఇంటి పనులను సొంతంగా పూర్తి చేసే రోజులు రానున్నప్పటికీ, వాటి తయారీ వెనుక మానవులు పడుతున్న ఈ అసాధారణ శ్రమ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.




