
నీరు.. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. నీరు లేకుంటే మనకు మనుగడ లేదు. అయినా కూడా చాలా మంది నీటిని వృధా చేస్తుంటారు. అలాంటి వాళ్ల గురించి పక్కనపెడితే.. నీటి విలువ తెలిసి, నీటిని దైవంలా కొలుస్తూ.. తమ నేలపై పరవళ్లు తొక్కుతూ వచ్చే ప్రతి నీటి బొట్టును.. రెండు చేతులెత్తి మొక్కే ప్రజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం ఉన్నప్పటికీ.. కన్నడ గడ్డ నుంచి తమిళ నేలపైకి కావేరి జలాలు వచ్చే సమయంలో తమిళనాడు డెల్టా ప్రాంత ప్రజలు పడే సంతోషం అంతా ఇంతా కాదు. వారి ప్రాంతంలోని కాలువల్లోకి కావేరి జలాలు వస్తుంటే.. ఎదురెళ్లి మరీ హారతులిస్తారు.
అమ్మా.. కావేరమ్మ తల్లి.. మమ్మల్ని బతికించేందుకు.. మాకు బతుకునిచ్చేందుకు వచ్చావా తల్లీ.. అంటూ తమ ఆనందభాష్పాలతో కావేరి నీళ్లకు అభిషేకం చేస్తారు. నీరు అలా వస్తుంటే.. కాలువల్లోకి దిగి.. మొక్కుతుంటారు. ఈ తంతు ప్రతి ఏడాది జరుగుతుంది. తమ జీవితాల్లో వెలుగు నింపి, పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని కావేరమ్మను వేడుకుంటూ ఉంటారు. తాజాగా ఈ ఏడాది కూడా కావేరి జలాలు తమిళ గడ్డను తాకుతున్న తరుణంలో డెల్టా ప్రాంత ప్రజలు హరతులిస్తూ.. పూజలు చేశారు. ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటి విలువ తెలిసిన మనుషులు.. ఆ జీవధారకు ఇస్తున్న గౌరవం, చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే కళ్లు చెమర్చాల్సిందే.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి