ఎస్‌ఎస్‌ఎల్‌సీ( Secondary School Leaving Certificate) పరీక్షలో మూడుసార్లు ఫెయిల్ అయిన ఓ బాలుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. తిప్పసంద్ర సర్కిల్ పరిధిలోని లక్ష్మీభువనేశ్వరి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మరుసటి రోజు ఆలయానికి వచ్చిన భక్తులు విగ్రహం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జీవన్ భీమానగర్ పోలీసులు విచారణ చేపట్టగా.. సీసీ టీవీలో బాలుడు చేసిన పని బయటపడింది.
తిప్పసంద్రలో నివాసం ఉండే ఓ మైనర్ బాలుడు దేవీ భక్తుడు. భువనేశ్వరీదేవికి రోజూ పూజలు చేశాడు. తాను పరీక్షలో పాసయ్యేలా చూడాలని వేడుకున్నాడు. కానీ, అతని ప్రార్థనలు నెరవేరలేదు. 3వ సారి కూడా ఎస్‌ఎల్‌సీలో ఫెయిల్ అవ్వడంతో.. అమ్మవారి మీద ఆ బాలుడికి విపరీతమైన కోపం వచ్చింది. దేవత.. తన మొర ఆలకించలేదని రగిలిపోయాడు. గుడి వద్దకు వెళ్లి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఆ దృశ్యం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఆ మైనర్ బాలుడు అర్థరాత్రి ఒంటరిగా నడుస్తూ రోడ్డుపై ఏదో మాట్లాడుతూ వెళ్లడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. జీవన్ భీమానగర్ పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చేందుకు డాక్టర్లను సంప్రదిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..