బీహార్‌లోని గయలో జరిగిన ఓ పెళ్లి కొడుకుపై దాడి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొదటి భార్య బతికుండగానే రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ధోబీ పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి కుటుంబ సభ్యులకు తన మొదటి పెళ్లి విషయం దాచి, మాయామాటలు చెప్పి.. ఎలాగోలా పెళ్లి పీటల వరకూ తీసుకొచ్చాడు. అయితే లాస్ట్ మినిట్ లో అతనికి ఇంతకుముందే పెళ్లైందన్న విషయం తెలిసి.. యువతి కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. అన్యాయంగా తమ కూతురిని బలిచేయబోయామని.. ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. సెహ్రా ధరించి పెళ్లికి సిద్ధంగా కూర్చున్న ఆ వ్యక్తిని ఓ కొంతమంది వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పెళ్లికి వచ్చిన ఇతర బంధువులు, గ్రామ ప్రజలు అతడ్ని పట్టుకొని బాగా కొట్టారు. తప్పైందని పెళ్లికొడుకు చేతులు జోడించి పదే పదే క్షమాపణలు చెబుతున్నా.. ఏ ఒక్కరూ ఊరుకోలేదు.
ఇక్కడితో ఈ దాడి ఆగిపోలేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. రెండో పెళ్లికి రెడి అయ్యావా అంటూ అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ ఊరిలోని మంగలిని పిలిచి గుండుగీయమని పురమాయించారు. అందుకు ససేమిరా అంటూ తన జుట్టును అదిమిపట్టుకున్నాడు పెళ్లి కొడుకు. కానీ ఆ జనంలో ఒకరు ధైర్యం చూసి ఆ జుట్టును లాగగా.. అతని చేతికి పెళ్లి కొడుకు విగ్గు ఊడొచ్చింది. దీంతో వరుడికి మొదటి పెళ్లి అయిందనే కాదు.. బట్టతల ఉందన్న రహస్యం కూడా బయటపడింది. ఇక కోపంగా ఉన్న యువతి బంధువులు ఇంకాస్త రెచ్చిపోయారు. బట్టతలతో ఉన్న ఆ నడి వయస్కుడికి తమ కూతురు కావాల్సి వచ్చిందా అనుకుంటూ మరోసారి ఉతికి ఆరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై దోభి పోలీస్ స్టేషన్ కానీ.. కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కానీ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.