క్రికెట్‌లో అభిమానులు ఎన్నో విచిత్రమైన బౌలింగ్ యాక్షలను చూసే ఉంటారు. పాల్ ఆడమ్స్ నుంచి లసిత్ మలింగ వరకు, జస్ప్రీత్ బుమ్రా నుంచి మతిషా పతిరనా వరకు.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన శైలిని ఆస్వాదించాం. ఈ జాబితాకు అంతం లేదంటూ ఇంగ్లండ్‌లో విలేజ్ క్రికెట్ ఆడిన జార్జ్ మెక్‌మెనెమీ అంటున్నాడు. తన బౌలింగ్ యాక్షన్‌తో సోషల్ మీడియాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాడు.
డ్యాన్స్ చేస్తూ బౌలింగ్..
జార్జ్ మెక్‌మెనెమీ తనను తాను ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌గా భావిస్తాడు. అతని బౌలింగ్ యాక్షన్ చాలా విచిత్రంగా ఉంటుంది. బంతిని విసిరే ముందు, అతను మొదట డ్యాన్స్ చేస్తాడు. ఆపై బంతిని తన చేతుల్లో ఉంచి, కొన్ని అడుగులు వేసి, విసిరేస్తాడు. ఇటువంటి పరిస్థితిలో బ్యాట్స్‌మన్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేడు. బంతి నేరుగా బ్యాటర్‌పైకి వస్తుంది.
తన బౌలింగ్ యాక్షన్ వీడియోను పంచుకుంటూ, జార్జ్ ఇలా వ్రాశాడు, “మిత్రులారా, నేను మూర్ఖుడిని కావచ్చు. నేను ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్‌ని కూడా కావచ్చు. కానీ, ఈ గేమ్ నా జీవితాన్ని కాపాడింది. నా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. నన్ను గొప్ప ఆటగాడిగా మార్చింది. మరోసారి సంతోషంగా ఉండేందుకు ఒక వేదిక ఇచ్చింది. నా తల్లి స్వర్గంలో గర్వపడుతుంది. క్రికెట్‌ని నేను ప్రేమిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు.
Folks I might be a fool, I might even be the worst cricketer in the world but this sport has saved my life, enriched my mental health and given me a platform to be happy once more and try to make my incredible Mummy proud up in heaven. Cricket I love you. #cricket #CricketTwitter pic.twitter.com/o46qOuAzA5
— George McMenemy? (@McMcMenemy) June 20, 2022
జార్జ్ మెక్‌మెనెమీ పంచుకున్న ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ జోన్స్‌కూడా ఈవీడియోపై కామెంట్ చేశాడు. ‘ఫెంటాస్టిక్ జార్జ్’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. జార్జ్ మెక్‌మెనెమీ తల్లి ట్రేసీ 2017లో మరణించారు. తల్లి మరణానంతరం అనేక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావడంతో ఒత్తిడికి లోనయ్యాడు. 2017-18 సంవత్సరంలో యాషెస్ సిరీస్ మ్యాచ్‌లు చూసిన తర్వాత క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడు క్రికెట్ మెక్‌నామీ జీవితాన్ని మార్చేసింది.