
ఎక్కడైన పాము కనిపిస్తే ఆమడదూరం పరిగెడతాం.. అదే పాము ఇంట్లో తిష్ఠ వేస్తే.. గుండెలు గుభేల్ అంటాయి. బీహార్‌లోని వాల్మీకినగర్ పరిధిలో ఉన్న మున్నీ లాల్ అనే వ్యక్తి ఇంట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 10 అడుగుల భారీ కింగ్ కోబ్రా అతడి ఇంట్లోకి చొరబడింది. పామును చూసిన కుటుంబసభ్యులు భయంతో వణికిపోయారు. అది బుసలు కొడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియడంతో మున్నీ లాల్ ఇంటి ముందు భారీగా జనం గుమికూడారు. కానీ ఆ భారీ విషసర్పం నుంచి ఆ కుటుంబానికి రక్షించడానికి ఆ ప్రాంత ప్రజలకు ఒకే ఒక్క పేరు గుర్తొచ్చింది.. ఆమే జానకి దేవి.
ఆ ప్రాంతంలో స్నేక్ లేడీగా పేరుగాంచిన జానకి దేవి నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం, అపారమైన ధైర్యంతో ఆమె ఆ 10 అడుగుల కింగ్ కోబ్రాని చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ ఉన్న జనాభాకు, ఆ పాముకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా దాన్ని బంధించారు. అనంతరం ఆ కింగ్ కోబ్రాని సమీపంలోని దట్టమైన అడవిలో విడిచిపెట్టారు.
జానకి దేవి 12 ఏళ్ల వయసు నుంచే పాములను పట్టుకోవడం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సార్లు విషసర్పాల కాట్లకు గురైనప్పటికీ, ఏనాడూ తన సేవలను ఆపలేదు. ఇప్పటివరకు ఆమె వేలాది విషసర్పాలను రక్షించి, అటవీ శాఖకు అప్పగించారు. ‘‘వర్షాకాలం, వాతావరణం మారే సమయంలో పాములు తమ సహజసిద్ధమైన నివాసాలను వదిలి, పొడిగా ఉండే సురక్షిత ప్రాంతాల కోసం జనావాసాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా వాల్మీకి టైగర్ రిజర్వ్ పరిసర గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రజలు ఎవరూ స్వయంగా పాములను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాలి’’ అని ఫారెస్ట్ రేంజర్ సత్యకుమార్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం కింగ్ కోబ్రా. దీని విషం నేరుగా మానవ నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది కరిచినట్లయితే క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అత్యవసరంగా వైద్య సహాయం అందించడం అత్యంత కీలకం. ఇలాంటి ప్రమాదకరమైన విషసర్పాల నుండి ప్రజల ప్రాణాలను, అలాగే మూగజీవాల ప్రాణాలను కాపాడుతున్న జానకి దేవి సాహసాన్ని స్థానికులతో పాటు అటవీ శాఖ అధికారులు సైతం అభినందిస్తున్నారు.