Heatwave in India: ఎండాకాలం వడగాల్పులతో తస్మాత్ జాగ్రత్త.. మండే గాలుల బారిన పడితే మటాష్

|

Apr 03, 2021 | 11:48 AM

ప్రతి సారీ ఎండా కాలం వస్తుంది. వడగాల్పులు రావడం సహజం. వేసవి తాపానికి జనాలు విలవిలలాడటం ఖాయం. ఇవన్నీ ప్రతి యేడూ కామన్ గా జరిగేదే కదా..

Heatwave in India: ఎండాకాలం వడగాల్పులతో తస్మాత్ జాగ్రత్త.. మండే గాలుల బారిన పడితే మటాష్
Heat Wave
Follow us on

Heatwave in India:  ప్రతి సారీ ఎండా కాలం వస్తుంది. వడగాల్పులు రావడం సహజం. వేసవి తాపానికి జనాలు విలవిలలాడటం ఖాయం. ఇవన్నీ ప్రతి యేడూ కామన్ గా జరిగేదే కదా.. ఇప్పుడు కొత్తగా చర్చ ఏంటి అనుకుంటున్నారా.? ఈ సారి ఎండలు ప్రత్యేకమండోయ్.

ఈ సారి ఏప్రిల్ కన్నా ముందే 40 డిగ్రీల్ సెల్సియస్ దాటింది. వాతావరణ శాఖ సైతం ఈ సారి వేసవి ఉష్ణోగ్రతలపై హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కన్నా 0.5 నుంచి 1 డిగ్రీ వరకూ అధికంగా సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంది. వడగాల్పుల తీవ్రత కూడా ఈ సారి అధికంగా ఉంటుందట.

భారత్‌లో ఏటా ఏప్రిల్, మే నెలలో వడగాల్పులు వీస్తున్నా.. ఇటీవల కాలంలో వీటి తీవ్రత మరింత పెరుగుతోంది. 1998 నుంచి 2017 వరకు దేశంలో లక్షా 60 వేల మంది ఒక్క వడగాల్పుల వల్లే చనిపోయారంటే తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోండి.

ఆర్కిటిక్ ప్రాంతంలోని భూతాపమే భారత్‌లో వడగాల్పుల తీవ్రతకు కారణమని.. రాయల్ మెటీరియలాజికల్ సొసైటీకి చెందిన జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం చెప్తోంది. ఈ భూతాపం వల్ల ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నివేదిక చెప్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటా 45 డిగ్రీలకు పైగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.

మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకు మించినా.. కొండ పర్వత ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్ దాటినా వడగాల్పులుగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది. సాధారణంగా మానవుని శరీరం 37 డిగ్రీల సెల్సియస్ వరకే తట్టుకోగలదట. అంతకు మించి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరం గాలిలో ఉండే వేడిని గ్రహిస్తుంది. ఈ గాలిలో తేమ శాతం తగిలితే వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతారు. ఒక్కోసారి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ తేమ శాతంలో ప్రభావం వల్ల వడదెబ్బ వచ్చే అవకాశాలు ఉన్నాయట.

భూతాప వృద్ధిని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా కట్టడి చేసినా 21వ శతాబ్ధం చివరి నాటికి దక్షిణాసియాలో భీకర గాలులు తప్పవని గతంలో కొన్ని అధ్యనాలు వెల్లడించాయి. 2015లో వడగాల్పుల వలన భారత్, పాకిస్తాన్‌లో దాదాపు 3500 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవన్నీ చూస్తుంటే వడగాల్పుల ప్రతాపం తప్పేలా లేదు. మరీ ఈ తాపాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి. ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే కాస్తైనా ఉపశమనం పొందొచ్చు.? ముఖ్యంగా వాతావరణంలో ఇటీవలి కాలంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగటి పూట భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లబడకపోవడం వల్లనే శరీరంపై ప్రభావాన్ని చూపుతోంది. వడగాల్పుల మరణాలకూ ప్రధానంగా ఇదే కారణమవుతోంది.

ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, సలహాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంచి.. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే శీతల పానీయాలు, పండ్ల రసాలు సేవించాలని చెప్తున్నారు. మరోవైపు వడగాల్పులపై అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత ముమ్మరం చేస్తే.. వడగాల్పుల ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైద్య ఆరోగ్య, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేస్తే వడగాల్పులు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ, కార్మిక రంగంపైనే ఆధారపడిన భారత్ లాంటి దేశాల్లో ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండటం అనేది అసాధ్యం. కాబట్టి భానుడి ప్రతాపం నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాల సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.

Also Read: PM Kisan: రైతులు బీ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చాయా ? ఇలా చెక్ చేసుకోండి..

ఇలాంటి పండ్లతో ఎముకలను దృఢంగా తయారు చేసుకోవచ్చు తెలుసా..? అవి ఏంటంటే..?