
బీహార్‌లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం మహాబోధి ఆలయం దగ్గర జరిగిన ఓ ఘటన హృదయాలను హత్తుకుంది. 57 సెకన్ల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కొందరు బౌద్ధ సన్యాసులు చేతుల్లో భిక్షా పాత్రలు పట్టుకుని రోడ్డుపై వెళ్తూ కనిపించారు. అదే సమయంలో రోడ్డు పక్కన కూర్చున్న ఓ యాచకుడు తన జేబులో దేనికోసమో వెతికాడు. అతడిని గమనించిన ఓ బౌద్ధ సన్యాసి అక్కడ ఆగారు. యాచకుడు జేబులో నుంచి నాణేలను బయటకు తీసాడు. వాటితో పాటు పక్కనే ఉంచుకున్న కొంత ఆహారాన్ని కూడా సన్యాసి భిక్షా పాత్రలో వేసాడు. సాధారణంగా యాచకులు ఇతరుల దగ్గర ఆహారం, డబ్బులు అడుక్కుంటారు. కానీ ఇక్కడ ఓ యాచకుడు మాత్రం తన దగ్గర ఉన్న ఆహారాన్ని, డబ్బును బౌద్ధ సన్యాసికి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
తన దగ్గర ఉన్న ఆహారం, డబ్బును దానం చేసిన అనంతరం యాచకుడు తలపై టోపీ తీసాడు. రెండు చేతులతో సన్యాసి పాదాలను తాకి, తల వంచి నమస్కరించాడు. యాచకుడి మంచి మనసును చూసిన సన్యాసి కూడా ప్రేమగా స్పందించారు. ముందుగా అతడికి ఓ చిన్న వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ అందించారు. వాటిని సంతోషంగా తీసుకున్న యాచకుడికి మరోసారి తన భిక్షా పాత్రలో ఉన్న ఇంకో ఆహారం ఇచ్చారు. కొంత డబ్బు కూడా ఇచ్చి, అతడి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు.
రోడ్డుపక్కన జీవనం సాగిస్తున్న యాచకుడికి రెండు కాళ్లు లేని దివ్యాంగుడు. తనకు దొరికిన భోజనాన్ని బౌద్ధ సన్యాసికి అందించాడు. తన దగ్గరున్న డబ్బును ఆయనకు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. బౌద్ధ సన్యాసి స్పందించిన తీరు మరింత ప్రత్యేకంగా నిలిచింది. యాచకుడి దాతృత్వానికి ముగ్ధుడైన ఆయన ప్రేమతో స్పందించి, అతడిని ఆశీర్వదించారు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా మరొకరికి ఇవ్వాలనుకున్న యాచకుడి ఔదార్యం, దానికి అంతే ప్రేమతో స్పందించిన బౌద్ధ సన్యాసి తీరు నెటిజన్ల మనసులను గెలుచుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన దగ్గర ఉన్నది కొంతే అయినా దాన్ని మరొకరికి పంచాలనే యాచకుడి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజమైన దాతృత్వానికి డబ్బుతో సంబంధం లేదని, గొప్ప మనసు ఉంటే చాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కడుపు నింపుకోవడానికి తానే కష్టపడుతున్నా.. తన దగ్గర ఉన్న ఆహారాన్ని మరొకరికి పంచిన ఆ యాచకుడి మంచి మనసు ఎందరికో ఆదర్శం!