మీరు కంగనారనౌత్ నటించిన క్వీన్ సినిమా చూసే ఉంటారు కదా.. అందులో రాణి పాత్రలో కంగనా రనౌత్ ఎదుర్కొన్న చిత్రమైన పరిస్థితి గుర్తుండే ఉంటుంది. వివాహం తర్వాత తన భర్త పారిపోతే, కంగనా ఒంటరిగా హనీమూన్‌కు వెళుతుంది. కానీ, ఇక్కడ ఓ యువతి పెళ్లి తప్పించుకుని పారిపోతున్న వరుడ్ని వెంటాడి లాక్కొచ్చి మరీ పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.
యూపీలోని బారాదరి ప్రాంతానికి చెందిన ఈ వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు వైపుల కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదిరింది. మే 21న భూతేశ్వర్ నాథ్ ఆలయంలో వీరికి వివాహం ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలవారూ పెళ్లివేదికకు చేరుకున్నారు. కానీ ముహూర్తం సమీపించినా వరుడి జాడ లేదు. వధువు తనకు కాబోయే భర్త కోసం చూసి చూసి ఇక లాభం లేదనుకుని కాల్ చేసింది. అంతే అవతలనుంచి పెళ్లికొడుకు ఊహించని షాకిచ్చాడు.
‘నువ్వు నన్ను క్షమించాలి, మా అమ్మను తీసుకువచ్చేందుకు బుదాన్ వెళుతున్నాను’ అంటూ పెళ్లి తప్పించుకోడానికి కుంటి సాకులు చెప్పాడు. దాంతో చిర్రెత్తిన పెళ్ళికూతు క్షణం ఆలస్యం చేయకుండా తన వాళ్లను వెంట పెట్టుకుని వరుడి కోసం పరుగెత్తంది. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో భిమోర పోలీసు స్టేషన్ పరిధిలో అతడ్ని పట్టుకుంది. ఓ బస్సు ఎక్కుతుండగా వరుడ్ని పట్టుకుని పెళ్లి మండపానికి లాక్కొచ్చింది. ఇంకేముంది మూడు ముడ్లు, మేళతాళాలు, అక్షింతలతో వివాహం ముగిసింది. వధువు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.