అమ్మ చివరి చూపుకు నోచుకోలేక.. కృష్ణుడి పాదాల వద్ద కన్నీళ్లు పెట్టిన చిన్మయ దాస్!

బంగ్లాదేశ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ సన్యాసి చిన్మయ కృష్ణ దాస్‌ కు తన తల్లి అంత్యక్రియల్లో  పాల్గొనేందుకు పెరోల్ మంజూరైంది.  జైలు నుంచి ఐదు గంటల పెరోల్ పై బయటకు వచ్చిన చిన్మయ దాస్‌కు సంబంధించిన ఒక భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలుకు తిరిగి వెళ్లే ముందు చిట్టగాంగ్ లోని పుండరీక్ ధామ్ ఆలయాన్ని సందర్శించిన ఆయన, అక్కడ రాధా-కృష్ణుల విగ్రహాల పాదాలను తాకుతూ తీవ్రంగా కంటతడి పెట్టారు.  

అమ్మ చివరి చూపుకు నోచుకోలేక.. కృష్ణుడి పాదాల వద్ద కన్నీళ్లు పెట్టిన చిన్మయ దాస్!
Bangladesh Hindu Monk Chinmoy In Tears Touches Idols Feet

Updated on: Sep 11, 2026 | 7:50 PM

జైలులో ఉన్న తన కుమారుడిని కడసారి చూడాలని తీవ్రంగా తపించిన చిన్మయ కృష్ణ దాస్ 71 ఏళ్ల తల్లి, ఆ ఆశ నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు. చివరి రోజుల్లో తల్లిని కలుసుకునేందుకు వీలుగా  చిన్మయ దాస్ కు పెరోల్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తిని  బంగ్లాదేశ్ అధికారులు తోసిపుచ్చారు. తన కుమారుడిని చూడాలన్న చివరి కోరిక తీరకుండానే చిన్మయ కృష్ణ దాస్ తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం హతజారిలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. “మా అమ్మ ఇక లేదు. బ్రతికి ఉన్న సమయంలో నా తమ్ముడు కనీసం అమ్మను చూడలేకపోయాడు” అని  సోదరుడు అంజన్ కుమార్ ధర్ బంగ్లాదేశ్ పత్రిక ‘కాల్‌బెలాల’తో వాపోయారు.

కుమారుడి సుదీర్ఘ  జైలు జీవితం, అతని ఆరోగ్యం క్షీణించడం, పదే పదే బెయిల్ తిరస్కరణకు గురి కావడం వంటి పరిణామాలతో సంధ్యా రాణి ధర్ తీవ్ర మానసిక వేదన అనుభవించారు. తాజా బెయిల్ విచారణ సమయంలోనైనా ఆయన విడుదలవుతారని ఆశించినప్పటికీ, బెయిల్ రాకపోవడంతో ఆమె ఆందోళన మరింత పెరిగింది.

 అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేయాలని బుధవారం కుటుంబ సభ్యులు చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్, ప్రిజన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎక్స్-అఫీషియో ప్రెసిడెంట్ మొహమ్మద్ జాహిదుల్ ఇస్లాం మియాను ఆశ్రయించారు. అయితే, అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించేందుకు ఖైదీలకు పెరోల్ మంజూరు చేసే నిబంధన ఏదీ లేదని కమిషనర్ స్పష్టం చేసినట్లు ‘సమకాల్’ దినపత్రిక తెలిపింది.

రాధా కృష్ణుల పాదాల వద్ద కన్నీరుపెట్టిన దాస్

 

జైలు నుంచి విడుదలైన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ పుండరీక ధామ్‌ ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లిని చూడలేకపోయిన ఆవేదనతో కన్నీరుమున్నీరవుతూ విగ్రహ పాదాలను తాకిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి. ఆఖరు వీడ్కోలు కార్యక్రమం ముగిసిన వెంటనే, రాత్రి 9 గంటలకు ముగియాల్సిన పరోల్‌ గడువుకంటే ముందే ఆయన రాత్రి 8:30 గంటలకే చిట్టగాంగ్‌ సెంట్రల్‌ జైలుకు తిరిగి వెళ్లిపోయారు. ఆయన భావోద్వేగ వాతావరణంలో తిరిగి జైలు అధికారుల అదుపులోకి వెళ్లాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జ్యోత్ సంస్థకు ప్రతినిధిగా ఉన్న హిందూ సన్యాసి చిన్మయ కృష్ణ దాస్‌ను 2024 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం (సెడిషన్) కేసులు నమోదు చేశారు. ఆయన అరెస్టు బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనలకు, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. 2024లో హింసాత్మక విద్యార్థి ఉద్యమాల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత దేశంలో అశాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో మైనారిటీల హక్కులు, భద్రత, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ చిన్మయ కృష్ణ దాస్ నేతృత్వంలోని బృందం బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు భారీ ర్యాలీలు నిర్వహించింది.

చిన్మయ కృష్ణ దాస్‌ పై ఆరు కేసులు

హిందూ మైనారటీల కోసం గళం విప్పిన దాస్ కు ఇస్కాన్‌తో అనుబంధం ఉంది.  చిన్మయ కృష్ణ దాస్‌పై మొత్తం ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు హైకోర్టు ఆయనకు నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ, మరో రెండు కేసుల్లో ఇంకా క్లియరెన్స్ రాకపోవడంతో ఆయన విడుదల నిలిచిపోయింది. ఆయనపై నమోదైన దేశద్రోహం (సెడిషన్) కేసుకు సంబంధించి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే కొనసాగుతోంది. మరోవైపు, ఛత్త్రాగ్‌ స్పీడీ ట్రయల్ ట్రిబ్యునల్‌లో ఆయనపై ఉన్న హత్య కేసుకు సంబంధించి విచారణ (ట్రయల్) కొనసాగుతోంది. చిన్మయ కృష్ణ దాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనకారులు చేపట్టిన ఆందోళనల సమయంలో ఈ హత్య జరిగింది. ఈ సంచలనాత్మక హత్య కేసు ప్రస్తుతం ఆయన విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది

Loading...
Unable to load recommendations.
Follow Us