ఇదేందయ్యా ఇది.. ఈ బొద్దింక ధర రూ. 1.34 కోట్లా.. ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Madagascar Hissing Cockroaches: ప్రస్తుతం ఈ భారీ కీటకాల స్థావరాన్ని సీజ్ చేసిన ఆస్ట్రేలియా పర్యావరణ శాఖ, దీని వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టును విప్పేందుకు లోతుగా దర్యాప్తు చేస్తోంది. స్థానిక జీవవైవిధ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ కీటకాల రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత విచిత్రమైన, భారీ కీటకాల అక్రమ రవాణా ఉదంతం వెలుగుచూసింది. బాథర్ట్స్ నగరంలో రహస్యంగా సాగుతున్న ఓ అంతర్జాతీయ స్మగ్లింగ్ కేంద్రాన్ని వన్యప్రాణి అధికారులు బద్దలు కొట్టారు. అక్కడ ఏకంగా లక్ష మడగాస్కర్ హిస్సింగ్ జాతి బొద్దింకలను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
రహస్య స్థావరంపై ఆకస్మిక దాడి..
న్యూసౌత్ వేల్స్ పరిధిలోని బాథర్ట్స్ పట్టణంలో ఉన్న ఒక నివాస భవనంలో భారీ ఎత్తున విదేశీ కీటకాలను అక్రమంగా పెంచుతున్నట్లు ఆస్ట్రేలియా పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ విభాగానికి అత్యంత నమ్మకమైన సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఫెడరల్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు సంయుక్తంగా మే 26వ తేదీన ఆ భవనంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. లోపలికి వెళ్లి చూసిన అధికారులకు అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోరేళ్లబెట్టారు. డబ్బాలు, ప్రత్యేక పెంపకం గదుల్లో వేలాదిగా కదులుతున్న భారీ బొద్దింకలు కనిపించాయి. లెక్కించగా అక్కడ ఏకంగా లక్ష బొద్దింకలు ఉన్నట్లు తేలింది. దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కీటకాలను పట్టుకోవడం ఇదే తొలిసారి అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
మార్కెట్లో కోట్ల రూపాయల విలువ..
సాధారణంగా మనం ఇళ్లల్లో చూసే బొద్దింకలకు వీటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంతర్జాతీయ నల్లబజారులో ఈ మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింకలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అధికారులు పట్టుకున్న ఈ లక్ష బొద్దింకల విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రెండు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు 1.34 కోట్ల రూపాయలు. కేవలం కీటకాల వ్యాపారంతో ఇంతటి భారీ సొమ్మును ఆర్జించేలా ఒక పెద్ద నెట్‌వర్క్ తెరవెనుక పనిచేస్తోందని అధికారులు అనుమానిస్తున్నారు.
పాములా బుసకొట్టే వింత కీటకాలు..
ఈ మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింకల ప్రత్యేకతలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి సాధారణ కీటకాల కంటే చాలా పెద్దవిగా, సుమారు మూడు అంగుళాల పొడవుతో మనిషి అరచేతి పరిమాణంలో ఉంటాయి. వీటికి రెక్కలు ఉండవు, కాబట్టి ఇవి అస్సలు ఎగరలేవు. అయితే వీటికి ఒక వింత లక్షణం ఉంది. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు లేదా ఎవరైనా వీటిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇవి పాములా ‘హిస్‌స్‌స్’ అంటూ వింత శబ్దం చేస్తాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. ఇక మగ బొద్దింకల తలపై చిన్నపాటి కొమ్ములు కూడా ఉంటాయి.
పెంపుడు జంతువుల ఆహారంగా భారీ డిమాండ్..
మడగాస్కర్ అడవుల్లో సహజసిద్ధంగా కనిపించే ఈ కీటకాలకు విదేశాల్లో ఎందుకు ఇంత డిమాండ్ ఉందనే దానికి ఒక కారణం ఉంది. వీటి శరీరంలో ప్రొటీన్లు అత్యధిక మోతాదులో ఉంటాయి. విదేశాల్లో సంపన్నులు పెంచుకునే విలాసవంతమైన పాములు, అరుదైన బల్లులు, ఇతర సరీసృపాలకు ఇవి ప్రధాన పోషకాహారంగా ఉపయోగపడతాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం వీటిని కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిస్తారు. ఈ క్రేజ్ ఆసరాగా చేసుకుని ఆస్ట్రేలియా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా కొందరు అక్రమంగా వీటిని దిగుమతి చేసుకుని పెంచుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
