విజయవాడలోని టోల్ ప్లాజాల దగ్గర పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతీ వాహనాన్ని చెక్ చేయకుండా వదిలిపెట్టడం లేదు. అయితే వారికి ఈలోగా ఓ మూడు కార్లపై కన్ను పడింది. వాటిని నడిపే డ్రైవర్స్‌పై అనుమానమొచ్చింది. దీనితో వెంటనే ఆ మూడు కార్లను టోల్ ప్లాజా దగ్గర ఆపి చెక్ చేయగా.. పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విజయవాడ కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తోన్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నెల 24వ తేదీన చెన్నై నుంచి గుంటూరు, రాజమండ్రికి బంగారం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు టోల్ ప్లాజాల వద్ద నిఘా పెట్టి.. ఆ ముఠా గుట్టురట్టు చేశారు.
అక్రమంగా భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని విజయవాడ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీనితో వాళ్లు అన్ని టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బోలపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా మూడు కార్లు కనిపించాయి.. వాటిని ఆపి చెక్ చేయగా సీట్ల కింద ప్రత్యేక అరల్లో బంగారం బిస్కెట్లు, ఆభరణాలు లభ్యమయ్యాయి. మొత్తం మూడు కార్లలోనూ సుమారు 10.77 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ బంగారం మార్కెట్ విలువ రూ. 5.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.