బీహార్, ఆగస్టు 21: కుమార్తె చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. ఈ సమయంలో ఓ తెలియని నంబర్ నుంచి వారికి వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేయగానే తన కుమార్తె కనిపించడంతో.. ఆ తండ్రి ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో వెలుగుచూసింది. ఓ యువతి నెల రోజుల ముందు అదృశ్యమైంది. ఆ తర్వాత స్థానిక కాలువలో ఓ యువతి మృతదేహం లభ్యమవ్వడంతో.. తమ కుమార్తెదే అనుకుని వారు అంత్యక్రియలు చేశారు. దహన సంస్కారాలు జరిగిన ఒక నెల తర్వాత, “నాన్న నేను ఇంకా బతికే ఉన్నాను” అంటూ తండ్రికి వీడియో కాల్ చేసింది కుమార్తె. దీంతో ఎంక్వైరీ చేసిన పోలీసులు… దహన సంస్కారాలు నిర్వహించిన మృతదేహం.. మరో యువతిది అని పోలీసులు గుర్తించారు. పొరపాటున తమ కూతురిది అని భావించి వారు అంత్యక్రియలు చేశారని చెప్పారు. ప్రస్తుతం వారి కుమార్తె అన్షు ఆచూకి దొరికిందన్నారు. అన్షు నెల రోజుల క్రితం అదృశ్యమైంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమె ఆచూకి కోసం చాలా రకాలుగా ప్రయత్నించారు. తమ కుమార్తె అదృశ్యంపై సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయగా.. నెల రోజుల తర్వాత కాలువలో మృతదేహం లభ్యమైంది. కానీ కుటుంబ సభ్యులు ఆమె ముఖాన్ని గుర్తించలేకపోయారు. డెడ్ బాడీపై ఉన్న దుస్తులు ఆధారంగా తమ కుమార్తే అని భావించారు. దీంతో వారు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
ఈ వార్త తాజాగా తన వద్దకు చేరడంతో, అన్షు తన తండ్రికి ఫోన్ చేసి, తాను బతికే ఉన్నానని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి పారిపోయానని చెప్పింది. అన్షు తన ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. అక్బర్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) సూరజ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం అన్షు తన అత్తగారి ఇంట్లో నివసిస్తోందని తెలిపారు.
దహనం చేసిన మృతదేహం ఎవరది? అన్న విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. ఆమెది పరువు హత్యగా భావిస్తున్నారు. యువతిని తల్లిదండ్రులే చంపి పరారయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు జరుపుతున్నారు. అన్షు ఫోన్ చేయకపోయి ఉంటే.. ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. కాగా స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..