Viral Video: మొసలికి మాంసం దొరికితే వదిలిపెడుతుందా? ఛాన్సే లేదు. పొరపాటున ఏ జీవి అయినా దానికి చిక్కినా.. దాని వద్దకు వెళ్లినా ఇక అంతే సంగతులు. వేటాడి నమిలి నమిలి మింగేస్తాయి. నదులు, చెరువుల వద్దకు సరదాగా వెళ్లి ఎంతోమంది మొసళ్లకు బలైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కొన్ని భయంకరమైన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగక మానదు. ఎందుకంటే.. ఆ వీడియోలో ఓ భారీ మొసలి చిన్నపాటి కుక్క పిల్ల హడలెత్తించింది. పరుగులు తీయించింది. నది నుంచి బయటకు వచ్చిన మొసలిని.. తిరిగి నదిలోకి పారిపోయేలా బెంబేలెత్తించింది. ఆ కుక్క దెబ్బకు జడుసుకున్న మొసలి.. బతుకు జీవుడా అన్నట్లుగా పరుగులు తీసి గబాలున నీటిలోకి దూకేసింది. ఈ వీడియోను ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో ఏముందంటే.. ఒక ముసలి పక్కనే ఉన్న సరస్సు నుంచి బయటకు వచ్చింది. ఆహారం కోసం వెతుక్కుంటూ పొదల్లోకి వస్తోంది. అంతలో ఆ మొసలికి ఓ చిన్న కుక్క పిల్ల కంటపడుతుంది. దానిని చూసి మొసలి తనలో తాను మురిసిపోయి ఉంటుంది. ఈ పూటకు ఆహారం దొరికిపోయిందని సంతోష పడి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ మొసలి.. కుక్కపై అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఈ కుక్క అన్ని కుక్కల మాదిరికాదని నిరూపించుకుంది. మొసలిని చూసిన కుక్క.. ఏమాత్రం బెదరకుండా ముందుకు దూకింది. మొసలిని అదిలిస్తూ గట్టిగా అరిచింది. అలా ఆ మొసలిని కుక్క హడలెత్తించింది. వచ్చిన దారిలోనే వెనక్కి పారిపోయేలా చేసింది. కుక్క పిల్ల దెబ్బకు భయపడిపోయిన మొసలి.. అక్కడి నుంచి వెనుదిరిగి పారిపోయింది. ఒక్క ఉదూటున నీటిలోకి జారుకుంది. మొసలి వెళ్లిపోవడంతో ఆ కుక్క పిల్ల తాపీగా వెనక్కి మళ్లింది.
అయితే, ఈ సీన్‌ను అంతా పక్కను ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను ‘The Dark Side Of Nature’ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఓ చిన్న కుక్క పిల్ల మొసలిని హడలెత్తించడం చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే దాదాపు 80 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2 వేలకు పైగా నెటిజన్లు లైక్స్ కొట్టారు. చాలా మంది కుక్క పిల్ల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి మరి.
Also read:
Snakes Nagamani: పాములకు నిజంగానే నాగమణి ఉంటుందా? కథలకు మాత్రమే పరిమితమా?