మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే, 8 కోట్ల ఏళ్ల నాటి రహస్యం బట్టబయలు!

మ్యూజియం అలమరల్లో దశాబ్దాల పాటు మరుగునపడి, ఇటీవల వెలుగుచూసిన ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 1985లో అంటార్కిటికాలో కనుగొనబడిన ఒక శిలాజం, ఇన్నాళ్లూ సాధారణ సముద్రపు సరీసృపానికి చెందినదిగా భావించి లండన్ మ్యూజియం డ్రాయర్‌లో భద్రపరిచారు. అయితే ఇటీవల Acta Palaeontologica Polonica జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధనల ప్రకారం, అది 82 మిలియన్ల ..

మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే, 8 కోట్ల ఏళ్ల నాటి రహస్యం బట్టబయలు!
Antarctica Dinosaur Fossil

Updated on: Jul 07, 2026 | 9:05 AM

ప్రస్తుతం అత్యంత శీతల వాతావరణంతో, మానవ నివాసానికి వీలుకాని మంచు ఖండంగా ఉన్న అంటార్కిటికా చరిత్రను మార్చేసే ఒక సంచలన నిజం బయటపడింది. శాస్త్రవేత్తలు సుదూర ప్రాంతాలలో తవ్వకాలు జరపకుండానే, ఒక మ్యూజియం డ్రాయర్‌లో 40 ఏళ్లుగా దుమ్ముపట్టి ఉన్న పాత ఎముకను పరిశీలించి అంటార్కిటికా ఖండపు మొట్టమొదటి డైనోసార్ శిలాజాన్ని (Dinosaur Fossil) అధికారికంగా గుర్తించారు.

బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకి చెందిన భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ మైక్ థామ్సన్ 1985 డిసెంబర్‌లో అంటార్కిటికాలోని జేమ్స్ రాస్ ఐలాండ్ లో ఒక ఎముకను కనుగొన్నారు. అప్పట్లో లభించిన ఇతర సముద్ర జీవుల శిలాజాల ఆధారంగా, దీనిని కూడా ఒక సాధారణ ప్రాచీన సముద్ర సరీసృపం ఎముకగా భావించారు. తదుపరి పరిశోధనలు లేకుండానే దానిని బాక్సులో పెట్టి యూకేలోని మ్యూజియం స్టోరేజ్ డ్రాయర్‌కు తరలించారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఆ ఎముక గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఇటీవల కాలంలో బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే కలెక్షన్స్ మేనేజర్ మార్క్ ఇవాన్స్ పాత నిల్వలను పునఃపరిశీలిస్తున్నప్పుడు ఈ ఎముక ఆకారం విచిత్రంగా ఉండటం గమనించారు. ఇది డైనోసార్ ఎముకలా ఉందని అనుమానించి, లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం పాలియాంటాలజిస్ట్ ప్రొఫెసర్ పాల్ బారెట్‌ను సంప్రదించారు. వారు ఆధునిక CT స్కాన్ సాంకేతికతను ఉపయోగించి ఆ ఎముక లోపలి నిర్మాణాన్ని విశ్లేషించారు. ఆ పరిశోధనలో అది ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ సమూహమైన టైటానోసార్ కు చెందిన తోక ఎముక అని ఖచ్చితంగా తేలింది.

ఇవి కూడా చదవండి

ఈ శిలాజం సుమారు 82 మిలియన్ల (8.2 కోట్ల) సంవత్సరాల క్రితం నాటి శాంటా మార్తా ఫార్మేషన్ అనే రాతి పొరల్లో లభించింది. ఈ డైనోసార్ చనిపోయిన తర్వాత దాని శరీరం సముద్రంలోకి కొట్టుకుపోయి, సముద్రపు అడుగుభాగంలో మునిగి శిలాజంగా మారి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా టైటానోసార్‌లు 100 అడుగుల పైగా పొడవు ఉంటాయి. కానీ, అంటార్కిటికాలో లభించిన ఎముక ఆధారంగా ఈ జీవి కేవలం 20 నుండి 23 అడుగుల పొడవు మాత్రమే ఉందని, ఇది చిన్న వయసులోనే మరణించిన పిల్ల డైనోసార్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ ఆవిష్కరణ ద్వారా కోట్ల సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఖండాలు గోండ్వానా అనే ఒకే భూభాగంగా కలిసి ఉండేవనే సిద్ధాంతానికి బలమైన ఆధారం లభించింది. అప్పట్లో అంటార్కిటికా దట్టమైన ఆకుపచ్చని అడవులతో ఉంటూ, ఒక ఖండం నుండి మరో ఖండానికి డైనోసార్లు వలస వెళ్ళడానికి ఒక ల్యాండ్ బ్రిడ్జ్ లా ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మ్యూజియంలలో భద్రపరిచే పాత వస్తువులను ఆధునిక సాంకేతికతతో మళ్లీ పరిశీలిస్తే ఎన్నో చారిత్రక రహస్యాలు బయటపడతాయని చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us