Viral: మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకర రీతిలో

బీహార్‌లో తవ్వకాలలో ఒక పురాతన విగ్రహం బయటపడింది. ఇది కళాత్మకంగా ఆకర్షణీయంగా ఉండి, గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రమైంది. ఇంతకీ అది ఏ విగ్రహం.. ఏ రూపంలో ఉంది.. గ్రామస్తులు ఏమంటున్నారు.. అధికారులు ఏం చెబుతున్నారు..? ఈ కథనంలో తెలుసుకుందాం పదండి..

Viral: మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకర రీతిలో
Shiv Parvati Idol

Updated on: May 31, 2025 | 11:40 AM

కాలక్రమేణా మట్టిలో కలిసిపోయిన అనేక అద్భుతాలు తవ్వకాల్లో తరచూ బయటపడుతూ తమ ఉనికిని చాటుకుంటాయి. పురాతన విగ్రహాలు.. చారిత్రక అవశేషాలు ఎన్నో బయటపడుతున్నాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలోని జముయి జిల్లాలోని మంజోష్ గ్రామంలో ఇటీవలి తవ్వకాల సమయంలో ఒక అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం సుమారు 1,700–1,800 సంవత్సరాల నాటి పాళ వంశం ప్రారంభ కాలానికి చెందినదిగా నిపుణులు భావిస్తున్నారు. శివుడు, పార్వతిదేవి ఒకే రూపంలో ఉన్న ఉమామహేశ్వర విగ్రహం గ్రామస్థులను, అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఖైరా టోళాలోని కోల్హువా పోఖర్ సమీపంలో కొంతమంది గ్రామస్తులు తవ్వకాలు జరుపుతుండగా ఒక శబ్దం వినిపించింది. ఇంకాస్త తవ్వగా అందమైన పురాతన విగ్రహం వెలుగుచూసింది. ఈ విషయం గ్రామంలో వెంటనే వ్యాప్తి చెందింది. దీంతో జనాలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

గ్రామస్థులు ఈ విగ్రహాన్ని స్థానిక ఆలయం వద్ద ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఈ విషయం అధికారులకు చేరడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఈ విగ్రహాన్ని మ్యూజియంకు అప్పగించాలని కోరారు. ఇది జాతీయ వారసత్వం కాబట్టి శాస్త్రీయంగా సంరక్షించాలనే ఉంటుందని వారికి వివరించారు. అయితే విగ్రహం తమ దేవతా విశ్వాసానికి సంబంధించినది.. తమ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టారు. అధికారులు, గ్రామస్థుల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతుంది.

బీహార్ మ్యూజియంకు చెందిన పురావస్తు నిపుణుడు డా. రవి శంకర్ గుప్త ఈ విగ్రహాన్ని పరిశీలించారు. ఇది పాళ వంశపు ప్రారంభకాలానికి చెందినదిగా నిర్ధారించారు. “ఉమామహేశ్వర విగ్రహం హిందూ ధార్మిక కళారూపానికి చెందిన అరుదైన, మహత్తర నిధి,” అని ఆయన తెలిపారు. విగ్రహంపై శివుడు నందిపై, పార్వతిదేవి సింహంపై కూర్చున్నట్లుగా ఉంది. శివుని జటాలు స్పష్టంగా చెక్కబడి ఉంటే.. పార్వతి దేవీ అందమైన నగలు, హారాలు, చెవిపోగులు, కాలు గజ్జెలతో అలంకరించబడి, లలితాసనంలో శివుని వైపు చూస్తూ ఉన్నారు. ఇలాంటి విగ్రహాలు చాలా అరుదైనవని డా. గుప్త చెప్పారు.

ఈ విగ్రహాన్ని గ్రామంలోనే ఉంచి గుడి కట్టి పూజలు చేయాలా లేదా శాస్త్రీయ సంరక్షణ కోసం మ్యూజియంకు అప్పగించాలా అన్న అంశం గ్రామస్థుల, అధికారుల మధ్య చర్చకు దారితీసింది. ఈ అంశంపై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..