తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే తప్ప ఓటేయమని తెగేసి చెప్తున్నారు సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరెపల్లి గ్రామస్తులు. స్థానికంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరో ఊరిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లబోమంటూ ఓటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డెక్కారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆరెపల్లిలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో.. ఓటర్లంతా ఆరెపల్లిలోనే ఓటేశారు. కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ఓటర్లకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పోలింగ్ కేంద్రాన్ని ఎత్తివేయడాన్ని వారంతా తప్పుబడుతున్నారు. పోలింగ్ బహిష్కరిస్తూ నిరసన చేపట్టారు ఆరెపల్లి గ్రామస్తులు.