
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకే కాదు.. జల్సాలకు అలవాటు పడ్డ ఆకతాయిలకు కూడా పెద్ద సమస్యగా మారినట్లుంది. అయితే సాధారణంగా ఆకతాయిలు ఒంటరిగానో, స్నేహితులతో కలిసో పెట్రోల్ చోరీలకు పాల్పడడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ యువతి, యువకుడు కలిసి బైక్‌లపై తిరుగుతూ అర్ధరాత్రి వేళల్లో పెట్రోల్ చోరీలకు తెగబడుతున్న ఉదంతం వరంగల్ నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రేమ జంట నిర్వాకం చూసి స్థానికులు, పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ పరిధిలోని 56వ డివిజన్‌లో గత కొన్ని రోజులుగా స్థానికులకు ఒక వింత సమస్య ఎదురవుతోంది. రాత్రి వేళల్లో ఇళ్ల ముందు, రోడ్లపై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పొద్దున లేచేసరికి పెట్రోల్ మాయమైపోతోంది. వరుసగా ఇలా బైక్‌లలో పెట్రోల్ లూటీ అవుతుండడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, కంటిమీద కునుకు లేకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీసీ కెమెరా విజువల్స్ చూసి షాక్!
అయితే ఈ పెట్రోల్ ఎందుకు మాయం అవుతుందని తెలుసుకునేందుకు కాలనీవాసులు తమ ఇళ్లకు ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అందులోని దృశ్యాలు చూసి వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అందులో అర్ధరాత్రి వేళ ఓ యువతి, యువకుడు బైక్‌పై కాలనీలో తిరుగుతూ కనిపించారు. బైక్‌పై ఉన్న ఆమ్మాయి ఎవరైనా వస్తున్నారా లేదా అని చుట్టుపక్కల నిఘా పెడుతుంది. అదే సమయంలో యువకుడు బైక్ దిగి, ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాల వద్దకు వెళ్తాడు. తన వెంట తెచ్చుకున్న ఖాళీ బాటిళ్లలోకి బైక్ ట్యాంకుల నుంచి పెట్రోల్‌ను గుట్టుచప్పుడు కాకుండా నింపేశాడు. పని పూర్తవ్వగానే ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు.
ఇదంతా చూసిన కాలనీవాసులకు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టడా రోడ్లపై పార్క్ చేసిన బైక్‌లనే టార్గెట్ చేస్తూ ఈ జంట చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే ఈ ‘పెట్రోల్’ జంటను పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
ఇదిగో వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.