Kishan Reddy: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మిషన్ మోడ్‌లో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్ పనులు..

ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రంతో పాటు పౌర విమాన సర్వీసులు నడిపేలా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కీలక సమీక్ష నిర్ణయించారు.

Kishan Reddy: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మిషన్ మోడ్‌లో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్ పనులు..
Adilabad Airport Update

Updated on: Sep 12, 2026 | 4:46 PM

ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆదిలాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కీలక అడుగులు పడ్డాయి. ఒకవైపు దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూనే, మరోవైపు ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన రంగాన్ని, ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేందుకు ఈ ప్రతిపాదిత విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం న్యూఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు.

మిషన్ మోడ్‌లో ప్రాజెక్టు.. నోడల్ అధికారుల నియామకం

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేసేందుకు, సమన్వయం కోసం రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే వారం చివరి నాటికి ఒక్కో నోడల్ అధికారిని నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లడంతో పాటు డీపీఆర్, సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

భారీ రన్‌వే.. అధునాతన మౌలిక వసతులు

ఈ ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్ట్ కోసం దాదాపు 2.75 కిలోమీటర్లు భారీ రన్‌వేను నిర్మించనున్నారు. ఇప్పటికే భారత వైమానిక దళం వద్ద 369.45 ఎకరాల స్థలం ఉంది. వీటికి అదనంగా శిక్షణ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్, హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్, మెయింటెనెన్స్ సెంటర్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 1,500 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు.
పౌర విమానయాన అవసరాల కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ప్యాసింజర్ టెర్మినల్‌తో పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రక్షణ సిబ్బంది కోసం ప్రత్యేక క్వార్టర్స్, రిక్రియేషన్ క్లబ్‌లు, ప్రత్యేక తాగునీరు మరియు పారిశుధ్య మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు.

సుదీర్ఘ ప్రయత్నాలకు లభించిన ఫలితం: కిషన్ రెడ్డి

2025 జనవరిలో ఆదిలాబాద్‌లో పూర్తి స్థాయి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాయగా.. ఆయన సానుకూలంగా స్పందించి జాయింట్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధికి అంగీకరించారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, 2026 ఏప్రిల్‌లో ఉమ్మడి తనిఖీలు పూర్తి చేయించినట్లు తెలిపారు. ఏళ్ల తరబడి సాగించిన నిరంతర కృషి, ఉత్తర ప్రత్యుత్తరాలు, సమీక్షల ఫలితంగానే నేడు ఆదిలాబాద్ ప్రజల ఎదురుచూపులు ఫలించాయని, ఇది యావత్ ఉత్తర తెలంగాణ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఊపునిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us