బతుకుదెరువు కోసం ఉన్నఊరిని, కన్నవారిని వదిలేసి వచ్చారు. స్వగ్రామానికి దూరంగా ఉంటూ.. చేతికందిన పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. రోజువారీ లాగే పనులకు బయల్దేరిన ఆ యువకులు రోడ్డు ప్రమాదం(Road accident) రూపంలో మృత్యు ఒడికి చేరారు. పొద్దంతా పని చేసి, మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరుతామనుకున్న సమయంలో ఊహించని దుర్ఘటన వారి పాలిట శాపమైంది. వారి కుటుంబాలను శోకసంద్రంలో పడేసింది. గూడ్సు వాహనం బోల్తాపడి ఇద్దరు కూలీలు మృతిచెందగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన వరంగల్(Warangal) జిల్లా అమ్మవారిపేట మలుపు వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు.. వరంగల్ కాజీపేటలో నివాసం ఉంటూ ములుగు రోడ్డులో సెంట్రింగ్ వర్క్ చేస్తున్నారు. పని ముగించుకుని మంగళవారం సాయంత్రం ఇంటికి బయల్దేరారు. అమ్మవారిపేట మూల మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఎండీ.వాసీం, ఎండీ.అన్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కరీమాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై మడికొండకు వస్తున్న కడవెలుగు సుదర్శన్‌కు వాహనం తగిలింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read
Fenugreek Water: ఉదయాన్నే ఈ నీరు తాగితే డయాబెటిస్ అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!