
పింఛన్ తీసుకొని ఇంటికి వస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. మహిళ కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్ మండలం చమన్‌పల్లి గ్రామానికి చెందిన మార్సకోల పారుబాయి (45) అనే మహిళ పింఛన్ తీసుకునేందుకు వెళ్ళింది. పింఛన్ డబ్బులు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆమె వెళ్లే దారిలో ఉన్న బల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆ వాగును దాటే ప్రయత్నం చేయడంతో తీవ్ర నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగి ప్రాణాలు కోల్పోయింది.
కేసు నమోదు చేసిన పోలీసులు
సమాచారం అందుకున్న ఖానాపూర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు BNSS సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల హెచ్చరిక
ఈ ఘటన నేపథ్యంలో అధికారులతో పాటు పోలీసులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల సమయంలో ఉప్పొంగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ప్రాణాల కంటే ఏ పని ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.