
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు సాయిలి కిషన్ ప్రతిరోజులాగే కల్లు గీసేందుకు తాటిచెట్టుపైకి ఎక్కాడు. ఇన్నాళ్లు తమ పొట్ట కూటికి సాయంగా నిలిచిన తాటి చెట్టుపైనే.. అతను కన్ను మూస్తాడని ఊహించి ఉండడు. ఎత్తైన తాటి చెట్టుపై కల్లు గీస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. స్పృహ కోల్పోయిన కిషన్ చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు గమనించేలోపే జీవితం ఆగిపోయింది. చెట్టుపైన వేలాడుతున్న అతని దేహాన్ని చూసి గ్రామం మొత్తం షాక్‌కు గురైంది. వార్త తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆ దృశ్యం చూసి బోరున విలపించారు. ఉదయం మాట్లాడిన మనిషి.. కాసేపట్లో మృతదేహంగా కనిపించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
రోజూ ప్రాణాలను పణంగా పెట్టి చెట్టెక్కే అతని చేతులు ఇప్పుడు కదలకుండా నిశ్శబ్దంగా వేలాడుతూ కనిపించాయి. కుటుంబాన్ని పోషించేందుకు తాళ్లు ఎక్కిన కిషన్.. అదే తాటిచెట్టుపై చివరి శ్వాస విడవడంతో.. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పేదరికం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే గీత కార్మికుల బాధను మరోసారి ఈ సంఘటన గుర్తు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బందితో కలిసి కిందకు దింపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.