
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. హయత్‌నగర్ పరిధిలోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై కృష్ణ చైతన్యను అత్యవసరంగా కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా వ్యక్తిగత కారణాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణ చైతన్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని సమాచారం. స్వభావరీత్యా కృష్ణ చైతన్య ఎంతో మౌనంగా, అంతర్ముఖుడిగా ఉండేవారని, తన వ్యక్తిగత సమస్యలను ఎవరికీ చెప్పుకోని వ్యక్తిగా సహచరులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు తీవ్ర చికిత్స అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సుమారు మూడు నెలల క్రితం కుటుంబ సమస్యల కారణంగా తీవ్రంగా మనస్తాపం చెందిన కృష్ణ చైతన్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అప్పట్లో ఆయన కనిపించకపోవడంతో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. ఆ సమయంలోనే ఆయన నరాల సంబంధిత సమస్యలు, ముఖ్యంగా మెదడులో రక్త గడ్డలు (బ్రెయిన్ క్లాట్స్) ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలినట్లు తెలిసింది. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ విధుల్లో మాత్రం ఆయన పూర్తిగా సాధారణంగానే ఉండి, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..