
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు, విజయవాడ, గుంటూరు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం ద్వారా భారీగా డబ్బులు ఆదా కానున్నాయి.
బీహెచ్ఈఎల్ డిపో బస్సుల్లోనే రాయితీలు!
టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ డిపో నుంచి దూర ప్రాంతాలకు నడిచే బస్సుల్లో ఈ ప్రత్యేక రాయితీలను అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రంగారెడ్డి రీజియన్ ఆర్ఎం శ్రీదేవి వెల్లడించారు. బీహెచ్ఈఎల్ డిపో నుంచి బయలుదేరే బస్సుల్లో అప్ అండ్ డౌన్ ప్రయాణాలకు ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని తెలిపారు. అయితే ఇతర డిపోలకు చెందిన బస్సులకు ఈ రాయితీలు వర్తించవని ప్రయాణికులు గమనించాలి.
ఏ రూట్లో ఎంత తగ్గించారంటే?
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రాజధాని బస్సు టికెట్ ధర గతంలో రూ.600 ఉండగా, ప్రస్తుతం రూ.500కు తగ్గించారు. అంటే ఒక్కో టికెట్‌పై రూ.100 ఆదా అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధరను రూ.530 నుంచి రూ.450కు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు రూ.80 ప్రయోజనం కలగనుంది. ఇక దూరప్రాంత ప్రయాణికులకు మరింత ఊరటనిచ్చేలా మైసూరు, బెంగళూరు రూట్లలోనూ ధరలు తగ్గించారు.
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మైసూరు వెళ్లే వారికి ఒక్కో టికెట్‌పై రూ.620 తగ్గడం విశేషం. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు టికెట్ బుకింగ్ సమయంలో వర్తించే ధరను పరిశీలించుకోవాలి.
ప్రైవేట్ ట్రావెల్స్‌కు పోటీగా ఆర్టీసీ వ్యూహం!
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, బెంగళూరు, మైసూరు వంటి నగరాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా ఆకర్షణీయమైన ధరలతో ప్రయాణికులను ఆకట్టుకోవాలని భావిస్తోంది.
ఇతర రూట్లలోనూ రాయితీలు ఇవ్వాలని డిమాండ్!
బీహెచ్ఈఎల్ డిపో తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా రాయితీలు ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు. తక్కువ ధరలో సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరిన్ని మార్గాల్లోనూ ఇలాంటి రాయితీలు ప్రకటిస్తారా? అనేది వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..