మందుబాబులకు ‘బిగ్ షాక్’.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్‌పై ఎంతంటే?

తెలంగాణలో మద్యం ప్రియులకు చేదువార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

మందుబాబులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్‌పై ఎంతంటే?
Liquor Rates In Telangana

Edited By:

Updated on: May 02, 2026 | 8:23 AM

తెలంగాణలో మద్యం ప్రియులకు చేదువార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న ధరలకు త్వరలోనే రెక్కలు రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

మద్యం ధరల పెంపునకు ప్రధానంగా ఉత్పత్తి వ్యయం పెరగడమే కారణమని తెలుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిసరుకు రవాణా భారమైంది. గ్యాస్ ధరలు పెరగడం, బాటిల్స్ తయారీకి అయ్యే వ్యయం గణనీయంగా పెరిగిందని డిస్టిలరీ కంపెనీలు వాదిస్తున్నాయి. 2023 మేలో చివరిసారిగా ధరలు పెరిగాయి. 2025లోనే ధరలు సవరించాలని కంపెనీలు కోరినప్పటికీ, ప్రభుత్వం అప్పట్లో వాయిదా వేసింది. కానీ ప్రస్తుతం పెరుగుతున్న భారంతో ధరల సవరణ అనివార్యమని కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ వచ్చే వారం సమావేశమై తుది నివేదిక ఇవ్వనుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60 వరకు, ప్రీమియం బ్రాండ్స్‌పై రూ.100 వరకు, హైఎండ్ బ్రాండ్స్‌పై రూ.120 వరకు పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే కంపెనీలు కోరుతున్న స్థాయిలో పెంపు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చనే ఆందోళన ప్రభుత్వంలో ఉంది. అదే సమయంలో గుడుంబా ఉత్పత్తి పెరిగే ప్రమాదం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే మధ్యమార్గాన్ని ఎంచుకుని ధరలు నిర్ణయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

లిక్కర్ ధరల పెంపుతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం కూడా లభించనుంది. నెలకు సుమారు రూ.250 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.3000 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చేలా ధరలను సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఆ నివేదిక ఆధారంగా ఈ నెలలోనే లిక్కర్ ధరలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

అయితే, ధరలు భారీగా పెంచితే సామాన్యుల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా, గ్రామాల్లో గుడుంబా, కల్తీ మద్యం వంటి అక్రమ మద్యం తయారీ పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలపై భారం పడకుండా, అటు కంపెనీలకు నష్టం కలగకుండా మధ్యేమార్గం ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే వారం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ఈ నెలాఖరులోగా కొత్త ధరలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికి మందు బాబుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us