
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి వెంటనే తప్పించి మరొకరిని నియమించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన సంచలన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్ 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూమిలో హైడ్రా గత నెల 17న కూల్చివేతలు చేపట్టింది. ఈ చర్యలపై శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడంతో పాటు, పదేపదే ఉల్లంఘించే అధికారి రూల్ ఆఫ్ లాను ప్రమాదంలో నెట్టేసే ఆస్కారం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగరాదని స్పష్టం చేస్తూ.. రంగనాథ్‌ను కమిషనర్ పోస్టు నుంచి తొలగించి, ఆ స్థానంలో వేరొక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తనను పదవి నుంచి తొలగించాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ విషయంలో హైడ్రా పూర్తిగా నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని, చట్టపరిధిలోనే చర్యలు తీసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. రంగనాథ్‌ను తొలగించాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ స్టే ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో రంగనాథ్ యథావిధిగా హైడ్రా కమిషనర్ బాధ్యతల్లో కొనసాగనుండగా, హైడ్రా యంత్రాంగానికి, ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది.