తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి?

తెలంగాణలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ సుమారు 1.5కి పడిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రతి ఆరు జంటల్లో ఒకరిని సంతానలేమి సమస్య వేధిస్తోందని అంచనా. IVF, ART చికిత్సలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ..

తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి?
Just Born Baby

Updated on: Aug 08, 2026 | 6:16 PM

 

తెలంగాణలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు ఆలస్యంగా వివాహాలు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో పిల్లలను కనాలనే నిర్ణయం వాయిదా పడుతుండగా.. మరోవైపు సంతానలేమి సమస్యతో ఫెర్టిలిటీ క్లినిక్‌లను ఆశ్రయించే జంటల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత, నైతికత, రోగుల హక్కుల పరిరక్షణపై చర్చ మొదలైంది.

జనాభా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1గా పరిగణిస్తారు. అయితే తెలంగాణలో ఈ రేటు ప్రస్తుతం సుమారు 1.5కు పడిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇది జనాభా నిర్మాణంపై ప్రభావం చూపే అంశంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు.

జాతీయస్థాయిలో కూడా పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు సుమారు 1.5గా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 2.1కు దగ్గరగా ఉంది. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులు, కెరీర్‌పై దృష్టి, వివాహాలు ఆలస్యం కావడం వంటి అంశాలు జననాల రేటు తగ్గడానికి కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి?

ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి సమస్య ఒక ముఖ్యమైన ఆరోగ్య అంశంగా మారుతోంది. ప్రతి ఆరు జంటల్లో ఒకరిని సంతానలేమి సమస్య ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నించే జంటలు ఫెర్టిలిటీ చికిత్సలను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో IVF వంటి ART వంటి విధానాలకు డిమాండ్ పెరుగుతోంది.

అయితే IVF రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. చికిత్సల విషయంలో పారదర్శకత, సరైన సమాచారం, రోగుల హక్కుల పరిరక్షణ కూడా అంతే కీలకంగా మారుతున్నాయి. చికిత్సకు అయ్యే ఖర్చు, విజయావకాశాలు, ప్రత్యామ్నాయ చికిత్సలు, సంబంధిత వైద్యపరమైన రిస్క్‌లపై రోగులకు ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

అక్రమాలకు ART చట్టంతో చెక్‌?

ఫెర్టిలిటీ చికిత్సల్లో అక్రమాలు, అనైతిక పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్–2021ను తీసుకొచ్చింది. ART క్లినిక్‌లు, బ్యాంకుల నియంత్రణ, నమోదు, సేవల ప్రమాణాలు, రోగుల హక్కుల పరిరక్షణకు ఈ చట్టం కీలకమైన న్యాయపరమైన వ్యవస్థను కల్పిస్తోంది.

దేశంలోని ఫెర్టిలిటీ కేంద్రాలు చట్టానికి సంబంధించిన నిబంధనలను పాటించడంతో పాటు.. చికిత్స తీసుకునే వారికి వారి హక్కులు, చికిత్స విధానం, ఖర్చులు, సంభావ్య ఫలితాలు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ART చట్టం–2021తో ఫెర్టిలిటీ రంగంలో అక్రమాలకు చెక్ పెట్టొచ్చని పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ తెలిపారు.

తగ్గుతున్న ఫెర్టిలిటీ రేట్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు?

తెలంగాణలో సంతానోత్పత్తి రేటు మరింత తగ్గితే దీర్ఘకాలంలో జనాభా వృద్ధాప్యం, వర్కింగ్ ఏజ్ జనాభా తగ్గుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోవడం వల్ల లాంగ్‌టర్మ్‌లో ఇబ్బందులు తప్పవని డాక్టర్ హిమ దీప్తి చెబుతున్నారు.

అయితే సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ఒకే ఒక్క కారణం లేదని.. జీవనశైలి, ఒత్తిడి, ఆలస్య వివాహాలు, వయసు పెరిగే కొద్దీ ఫెర్టిలిటీ తగ్గడం, ఇతర పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని డాక్టర్ హిమ దీప్తి పేర్కొంటున్నారు.

అవగాహనతోనే పరిష్కారం

సంతానలేమి సమస్యను కేవలం వ్యక్తిగత లేదా కుటుంబ సమస్యగా చూడకుండా.. వైద్య, సామాజిక అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై అవగాహన పెంచుకోవడం కీలకం.

అదే సమయంలో ఫెర్టిలిటీ చికిత్సలు అందించే కేంద్రాలు కూడా నాణ్యతా ప్రమాణాలు, చట్టపరమైన నిబంధనలు, వైద్య నైతిక విలువలను కచ్చితంగా పాటించాలి. రోగులకు పూర్తి సమాచారం అందిస్తూ.. వారి నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంది.

తెలంగాణలో జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో.. నాణ్యమైన, పారదర్శకమైన ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉండేలా వైద్యులు, ప్రభుత్వ విభాగాలు, ఫెర్టిలిటీ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై అవగాహన పెంచడంతో పాటు.. సంతానలేమి చికిత్సల్లో నమ్మకం, పారదర్శకత, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఇదే.

Loading...
Unable to load recommendations.
Follow Us