ఇదిగిదిగో లోక్‌సభ అభ్యర్థుల జాబితా..! అంటూ ఊరిస్తూ వస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ, రాబోయే లోక్‌సభ దంగల్‌ని ఓరకంట గమనిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టిన ఊపు కారణంగా ఎంపీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ ఏర్పడింది. అందుకే తమతమ కర్చీఫులతో ఢిల్లీలో ఎవరికివాళ్లు లాబీయింగ్ షురూ చేశారు. సో, తుది జాబితా కమింగ్ సూన్ అన్నమాట.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి.. వెంటనే ముంచుకొచ్చిన లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గౌరవప్రదమైన సీట్లు గెలవకపోతే.. తలదించుకోవాల్సిన పరిస్థితి. అందుకే అభ్యర్థుల జాబితా నుంచే భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ అంటూ అలర్టయింది టీ-కాంగ్రెస్. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలు, పార్టీ బలాబలాలు, గెలుపు అవకాశాల్ని లోతుగా పరిశీలిస్తూ సీరియస్‌గా రంగంలో దిగింది సునీల్ కనుగోలు అండ్ హిజ్ టీమ్. మరోవైపు నుంచి మంత్రులు రివ్యూలు చేస్తున్నా.. సునీల్ కనుగోలు చేయించిన సర్వేల అధారంగానే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందట. మరి.. ఎవరి కిస్మత్ ఎంత గట్టిగా ఉన్నట్టు?
ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్ రేసులో అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాట సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశం చేజారిన అద్దంకి దయాకర్‌కే వరంగల్ టికెట్ వరించే ఛాన్సుంది. కానీ.. ఎస్పీగా ఉన్న శోభన్ కుమార్ కూడా వరంగల్ కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. మరో ఎస్సీ రిజర్వుడు స్థానం నాగర్‌కర్నూల్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ పోటీ పడుతున్నారు. ఎస్టీ స్థానమైన ఆదిలాబాద్ నుంచి యువ నాయకులు నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ పోటి పడుతున్నారు.
ఎస్టీ స్థానమైన మహబూబాబాద్ టికెట్ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ ఆశిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ కాశీరాంనాయక్ సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక తెలంగాణలోకెల్లా హాట్ సీట్ ఖమ్మం. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త వీ.రాజేంద్ర ప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్.. ఇలా ఖమ్మం టికెట్ కోసం పెద్ద క్యూనే ఉంది. అటు. ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని రిక్వెస్ట్ పంపింది టీపీసీసీ. మేడమ్ కనుక ఓకే చెబితే ఖమ్మం కహానీయే పూర్తిగా మారిపోవడం పక్కా.
హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్ పేర్లు బలంగా వినిపస్తున్నాయి. అయితే మజ్లిస్‌కి చెక్ పెట్టేందుకు పాతబస్తీలో పలుకుబడి ఉన్న ఎంబిటితో పొత్తు పెట్టుకుని.. హైదరాబాద్ సీటును వదులుకునే ఆలోచనలో కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీసీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మహిళా నేత నేరెళ్ల శారద ఆశిస్తున్నారు. నిజామాబాద్ టికెట్ కోసం ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజ్ పోటీలో ఉన్నారు. మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి ప్రయత్నిస్తున్నారు. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్‌కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అటునుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ట్రై చేస్తూనే ఉన్నారు.
మల్కాజిగిరి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, మెడ్చల్ టికెట్ చేజారిన హరివర్థన్ రెడ్డి ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్‌కి చెందిన ఒక మాజీ మంత్రికి రిజర్వు చేసినట్టు తెలుస్తోంది. అది వర్కవుట్ కాని పక్షంలో బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డిని చేవెళ్ల సీటు వరించే ఛాన్సుంది.
మహబూబ్ నగర్ నుంచి ఫార్మా కంపెనీ అధినేత జీవన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి… ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డికి, లేదా ఆయన కుమారుడికి టికెట్ ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. భువనగిరి టికెట్ కోసం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అటు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబీకులు కూడా భువనగిరి రేసులో ఉన్నారు.
ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లుంటే.. అధిష్టానం కూడా కసరత్తును వేగవంతం చేసింది. మంగళవారం సాయంత్రం గాంధీ భవన్‌లో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికపై లోతుగా సమాలోచనలు జరిపారు. డీసీసీల నుంచి వచ్చిన సిఫార్సు లేఖల్ని పరిశీలించింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీట్లపై సీరియస్‌గా ఫోకస్ చేసింది. జగ్గారెడ్డిని ఈసారి లోక్‌సభ బరిలో దించే అవకాశాలున్నాయి. భువనగిరి సీటు విషయంలో రేవంత్.. కోమటిరెడ్డి సన్నిహితుల మధ్య పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆశావహుల సంఖ్య పెరగడంతో వడబోసి.. షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్‌కి పంపాలని డిసైడైంది ఎన్నికల కమిటీ. ఢిల్లీ నుంచి ఫైనల్ లిస్టు రెండుమూడు రోజుల్లో రావొచ్చన్నది అంచనా.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..