ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. ఓటు పడే వరకే రాజకీయం. ప్రజాతీర్పుకు పట్టం కట్టేది ప్రభుత్వం. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీ ప్రభుత్వంగా ఏర్పడిదే ప్రమాణస్వీకారంతోనే. ఆ వేడుకకు రాజ్‌భవనే వేదిక. కానీ ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేసి ట్రెండ్‌ను మార్చారు ఎన్టీ రామారావు. తెలుగుదేశం ప్రభంజనానికి నాడు వేదికైంది భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న ఎల్‌బిస్టేడియం. డిసెంబర్ 1994లో అచ్చ తెలుగులో అన్నగారి ప్రమాణస్వీకారం.. ఎప్పటికీ చెరగని సంతకం.
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకార మహోత్సవంతో ఎల్‌బినగర్ స్టేడియం జాతరను తలపించింది అప్పట్లో. ఆ తరువాత మరో ప్రభంజనం. పాదయాత్రతో కాంగ్రెస్‌ను గెలుపు తీరానికి చేర్చిన వైఎస్ యుగం. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. ఎల్‌బి స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ప్రమాణస్వీకారోత్సవం. ఉచిత విద్యుత్‌పై సీఎంగా వైఎస్సార్ తొలిసంతకం. ఇందిరమ్య రాజ్యమే కాంగ్రెస్ మార్గమని నాడు వైఎస్సార్ సందేశం ఇచ్చారు. 2004..2009.లో విజయభేరి మోగించిన వైఎస్సార్.. రెండు సార్లు ఎల్‌బి స్టేడియంలోనే ప్రమాణస్వీకారం చేశారు.
ఇప్పుడు అదే మాట. అదే బాట. వైఎస్‌ఆర్ అడుగుజాడన తెలంగాణలో నవశకం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. ప్రజాభిమానం..అధిష్టాన ఆమోదం.. ఆ రెంటిని బ్యాలెన్స్ చేయడమే నాయకత్వ నైజం. నాడు వైఎస్సార్ – నేడు రేవంత్ రెడ్డి. విజయప్రస్థానానికి అదే మూలం. వైఎస్ ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం..ఇప్పుడు రేవంత్ సకల జనుల సాక్షిగా ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేయబోతున్నారు. ప్రజల మధ్య ప్రమాణస్వీకారం.. ఎల్‌బిస్టేడియం మరో సంరంభానికి ముస్తాబైంది. ఇది మరో చారిత్రక ఘట్టం.