ఇద్దరి ప్రాణాలు కాపాడి.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డిని రాష్ట్రపతి అవార్డు వరించింది. ఈ విషయాన్ని సోమవారం సాయత్రం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ కింద కరీంనగర్ జిల్లాకు చెందిన ఇన్‌స్పెక్టర్ కోరిపల్లి సృజన్‌రెడ్డి ఉన్నట్లు హోం శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురస్కారం కింద పతకం, కేంద్ర హోంమంత్రి సంతకం చేసిన సర్టిఫికేట్, ఏక మొత్తంలో నగదు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో అవార్డు గ్రహీతకు అందజేస్తాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలో ఉన్న మాడిపల్లి గ్రామంలో ఉన్న ఓ బావిలో చెత్తచెదారాన్ని తీసేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ సృజన్‌రెడ్డి మాడిపల్లికి చేరుకుని.. బావిలోకి దిగి మరిపెల్లి రాము, మల్లయ్యను బయటకు తీశారు. ఇన్‌స్పెక్టర్ ధైర్యసాహసాలను డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఇదే ఆదర్శప్రాయమైన చర్య ఇప్పుడు దేశంలో అత్యున్నత పురస్కారం ఉత్తమ్ జీవన్ రక్షక్ పదక్ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది.